ఎట్టకేలకు అమెరికా చేరిన ఏఐ ప్యాసింజర్లు

ఎట్టకేలకు అమెరికా చేరిన ఏఐ ప్యాసింజర్లు
  • ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన సంస్థ

న్యూఢిల్లీ: రష్యాలో చిక్కుకుపోయిన ఎయిరిండియా ప్రయాణికులు ఎట్టకేలకు అమెరికా చేరుకున్నారు. ఢిల్లీ నుంచి మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన విమానం సాంకేతిక సమస్య కారణంగా రష్యాలోని ఓ చిన్న టౌన్ లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.  అక్కడున్న అరకొర వసతులతో ఇబ్బంది పడుతూ సుమారు 39 గంటల పాటు ప్రయాణికులు అక్కడే గడిపారు. బుధవారం మధ్యాహ్నం ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా స్పెషల్ ఫ్లైట్​గురువారం తెల్లవారుజామున రష్యాలోని మగదన్  ఎయిర్​ పోర్టుకు చేరుకుంది.

అక్కడున్న 216 మంది ప్రయాణికులను, 16 మంది సిబ్బందిని తీసుకుని గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోకు టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నానికి విమానం శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.  కాగా.. ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది. ఇంజిన్ లో తలెత్తిన టెక్నికల్ సమస్య వల్లే ఏఐ173 విమానాన్ని రష్యాలోని మగదన్ ఎయిర్ పోర్టుకు మళ్లించినట్లు తెలిపింది.  ప్యాసింజర్లు తమకు సహకరించారని వివరించింది. ప్రయాణికుల సహనానికి తాము ఎప్పటికి రుణపడి ఉంటామని సంస్థ వెల్లడించింది. ప్యాసింజర్లకు ఫ్లైట్ చార్జీలను రీఫండ్ (పూర్తిగా వాపస్) చేస్తామని, ట్రావెల్ వోచర్ ఇస్తామని ప్రకటించింది.