
హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లను, నిరుద్యోగులను విస్మరించిన బీఆర్‌ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడిద్దామని ఏఐఎస్‌ఎఫ్ పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్ విద్యారంగ వైఫల్యాలపై చార్జ్‌షీట్‌ను బుధవారం మగ్దూం భవన్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ తదితరులు రిలీజ్ చేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను బీఆర్‌ఎస్ అమలు చేయలేదన్నారు. ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ అభ్యర్థులను నిరుద్యోగులు, స్టూడెంట్లను ప్రశ్నించాలని కోరారు.
అనేక మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ అరాచక పాలన కొనసాగుతోందన్నారు. గత ఎన్నికల్లో ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు కాలేదన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ మేనేజ్మెంట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. సర్కారు వర్సిటీలను నిర్లక్ష్యం చేసి, ప్రైవేటు వర్సిటీలకు అనుమతి ఇచ్చారన్నారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీలతో నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా స్టూడెంట్లను, వారి పేరెంట్స్‌ను ఏకం చేసేలా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు రఘురాం నాయక్, నాగజ్యోతి, రెహమాన్, గ్యార క్రాంతి, నరేశ్, వెంకటేశ్, రాజు పాల్గొన్నారు.