Ajinkya Rahane: వరుసగా రెండు గోల్డెన్ డకౌట్స్..టీమిండియాలోకి కష్టమే

Ajinkya Rahane: వరుసగా రెండు గోల్డెన్ డకౌట్స్..టీమిండియాలోకి కష్టమే

ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన తర్వాత అనూహ్యంగా టీమిండియా టెస్టు జట్టులోకి రహానే రీ ఎంట్రీ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టిన రహానే..విండీస్ టూర్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు రహానేను సెలక్టర్లు పక్కనే పెట్టేశారు. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో భారత్ ఓటమి పాలైన వెంటనే రహానే నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. భారత జట్టుకు తన అవసరం ఉందని చెప్పకనే చెప్పాడు. 

ఇటీవలే ముంబైకి రంజీ ట్రోఫీ అందించడంతో పాటు, భారత్ తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాలనే రెండు లక్ష్యాలున్నాయని రహానే వెల్లడించాడు. ఈ సీనియర్ ప్లేయర్ చేసిన ప్రకటనతో త్వరలో టీమిండియాలోకి రావాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా కనిపించాడు. అయితే రహానే అనుకున్నదేమీ జరగలేదు. రంజీ ట్రోఫీలో అదరగొడతాడని భావించిన ఈ ముంబై బ్యాటర్ ఆడిన రెండు ఇన్నింగ్స్ లలో తొలి బంతికే ఔటయ్యాడు. ఆంధ్రాతో జరిగిన మ్యాచ్ లో మొదటి బంతికి వెనుదిరిగిన ఈ సీనియర్ ప్లేయర్.. నేడు కేరళతో జరిగిన మ్యాచ్ లో సైతం మొదటి బంతికే తన వికెట్ కు కోల్పోయాడు. 

రహానే చేసిన ఈ పేలవ ప్రదర్శనకు ఇకపై టీమిండియాలో చోటు దక్కడం కష్టమనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. సెలక్టర్లు వరుసగా యువ ప్లేయర్లపై నమ్మకం ఉంచుతున్నారు. ఇటీవలే టీమిండియాలో చోటు కోల్పోయిన స్టార్ ప్లేయర్ పుజారా డబుల్ సెంచరీ చేసినా స్వదేశంలో ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు. ఈ సమయంలో వరుసగా గోల్డెన్ డకౌట్లు రహానే కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపించవచ్చు. 

ఈ మాజీ టెస్ట్ వైస్-కెప్టెన్ 85 టెస్టుల్లో 38.46 సగటుతో 5077 పరుగులు చేసాడు. 12 సెంచరీలు చేసిన రహానే అత్యధిక స్కోర్ ఇండోర్ లో 188 పరుగుల అత్యధిక స్కోర్ ను నమోదు చేసాడు.ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో  జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.