వాట్‌స్ ది ప్రొసీజర్.. అగార్కర్ ఎగ్జిట్‌పై జడేజా సెటైరికల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్!

వాట్‌స్ ది ప్రొసీజర్.. అగార్కర్ ఎగ్జిట్‌పై జడేజా సెటైరికల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్!

Ajit Agarkar’s Exit: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోవడం, ఆ ఖాళీ భర్తీకి బీసీసీఐ (BCCI) దరఖాస్తులు ఆహ్వానించడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సోషల్ మీడియాలో చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. సెలక్షన్ కమిటీ పోస్ట్ గురించి బీసీసీఐ పెట్టిన పోస్ట్‌పై జడేజా వేసిన సెటైర్ నెట్టింట వైరల్‌గా మారింది.

బీసీసీఐ పోస్ట్‌పై జడేజా వైరల్ కామెంట్

అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4వ తేదీతో ముగియడంతో, కొత్త చీఫ్ సెలెక్టర్ నియామకం కోసం బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బోర్డు పెట్టిన పోస్ట్‌పై రవీంద్ర జడేజా స్పందిస్తూ.. నవ్వుతున్న ఎమోజీతో "What’s the procedure" (ప్రాసెస్ ఏంటి?) అని కామెంట్ చేశాడు. సెలక్షన్ కమిటీలో ఖాళీల భర్తీపై జడ్డూ సరదాగా స్పందించాడా లేక సెలక్షన్ తీరును ఉద్దేశించి వ్యంగ్యాస్త్రం విసిరాడా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది.

జడేజా ఇటీవలి ఫామ్

ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు దూరంగా ఉన్న జడేజా.. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ మ్యాచ్‌లలో అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు.
2025 నుంచి ఆడిన 15 వన్డేల్లో 29.80 సగటుతో 149 రన్స్ చేయగా, 15 మ్యాచ్‌లలో కేవలం 14 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ ఏడాది ఐదు మ్యాచ్‌లలో కేవలం 2 వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకుని 8 వికెట్లు తీసి తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. 

►ALSO READ | నానా పటేకర్‌కు క్రికెట్ అంటే పిచ్చి.. చిన్నప్పుడు ఆఫ్ స్పిన్నర్: కోహ్లీ ఔటైతే తిండి కూడా మానేసేవారు!

2027 వన్డే వరల్డ్ కప్‌ రేస్‌లో జడేజా..

నవంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్న న్యూజిలాండ్ పర్యటన (5 వన్డేలు, 2 టెస్టులు) కోసం జడేజా ఎంపికపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, వెస్టిండీస్ సిరీస్‌కు ముందు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. జడేజా 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో కచ్చితంగా ఉన్నాడని, 20, 25 మంది కోర్ గ్రూప్ ఆటగాళ్లలో అతను ఒకడని వెల్లడించారు.