నాలుగేళ్లు.. మూడుసార్లు డిప్యూటీ సీఎం... రెండు సార్లు ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్

నాలుగేళ్లు.. మూడుసార్లు డిప్యూటీ సీఎం... రెండు సార్లు ఎన్సీపీని  చీల్చిన అజిత్ పవార్

శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ మూడోసారి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా 2023 జూలై 02 న ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నవంబర్‌ నుంచి ఇప్పటివరకు గడిచిన నాలుగేళ్లలో మూడుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు పవార్. అయితే ఆయన ఉపముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన  ఈ మూడు పర్యాయాల్లో  వేర్వేరు వ్యక్తులు సీఎంగా ఉన్నారు.  

2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీతో పొత్తులో ఉన్న శివసేన (విభజనకు ముందు) 56 సీట్లు గెలుచుకుంది.  అయితే ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. ఈ క్రమంలోఅజిత్  పవార్ కు బీజేపీ గాలం వేసింది. తన వర్గానికి చెందిన  ఎమ్మెల్యేలతో 2019 నవంబర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌పవార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

అయితే ఇది జరిగిన మూడు రోజులకే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనదైన రాజకీయ చతురతతో అజిత్‌పవార్‌ను వెనక్కి రప్పించారు.ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంంలోని బీజేపీ సర్కారు కూలిపోయింది. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిపి మహారాష్ట్ర వికాస్ అఘాడి పేరుతో 2019 డిసెంబర్‌ మొదట్లో సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. అప్పుడు ఉద్ధవ్‌ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, అజిత్‌ పవార్‌ రెండోసారి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.   

ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల ఏడు నెలల పాటు అధికారంలో ఉంది. ఆ తరువాత  శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర వికాస్ అఘాడి చీలిపోయింది.  అనంతరం మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు షిండే బీజేపీతో చేతులు కలిపారు.  2023  జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఫడ్నవీస్ డిప్యూటీగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్‌ పవార్‌ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ వచ్చారు.  

తాజాగా  అజిత్‌పవార్‌ రెండోసారి ఎన్సీపీని చీల్చి మహారాష్ట్రలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించారు. ఆయన 2023 జూలై 2 న ముచ్చటగా మూడోసారి డిప్యూటీగా ప్రమాణ స్వీకారం చేశారు.