
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ 2023 జూలై 17న మరోసారి భేటీ అయ్యారు. అజిత్ పవార్ తన బాబాయిని కలవడం 24 గంటల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. తన వర్గానికి చెందిన నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ కార్యాలయానికి చేరుకున్నారు అజిత్. అక్కడ పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై వీరు మరోసారి ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మళ్లీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు.
ఎన్సీపీని చీల్చి తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వ కూటమిలో చేరిన అజిత్ పవార్ 2023 జూలై 16 ఆదివారం రోజున శరద్ పవార్ తో కలిసి భేటీ అయ్యారు. . పార్టీని ఐక్యంగా ఉంచాలని తన బాబాయిని అజిత్ కోరారని ఆయన వర్గానికి చెందిన పార్టీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఆయన చెప్పింది శరద్ పవార్ మౌనంగా విన్నారని, ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదని తెలిపారు.
అయితే ఈ మీటింగ్ జరిగిన కాసేపటికే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించిన శరద్ పవార్.. విభజన రాజకీయాలకు పాల్పడే బీజేపీకి తాను మద్దతివ్వలేనని, ప్రగతిశీల రాజకీయాల వెంటే ఉన్నానని స్పష్టం చేశారు. 82 ఏళ్ల శరద్ పవార్ .. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.