
మళ్లీ రావా, దేవదాస్, పరంపర లాంటి ప్రాజెక్ట్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆకాంక్ష సింగ్.. ఇప్పుడు ‘షష్టిపూర్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రూపేష్ చౌదరితో కలిసి ఆమె నటించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈనెల 30న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ఇలా ముచ్చటించింది.
‘‘తెలుగులో కొంత గ్యాప్ తరువాత వస్తున్నాను. ఇందులో ‘జానకి’ అనే పాత్రలో లంగావోణీతో అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తా. కథ వినగానే ఇలాంటి కథలు ఇప్పుడు అవసరం అనిపించింది. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్‌లా కాకుండా నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ‘బెంచ్ లైఫ్’ తర్వాత మళ్లీ రాజేంద్ర ప్రసాద్ గారితో నటించా. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా.
మేమిద్దరం ఎమోషన్ సీన్స్‌ను గ్లిజరిన్ వాడకుండా రక్తి కట్టించాం. సినిమాపై ఎంతో ప్యాషన్ ఉన్న రూపేష్.. నటుడిగానే కాక నిర్మాతగానూ ఈ చిత్రానికి న్యాయం చేశారు. అలాగే మా దర్శకుడు పవన్.. క్లారిటీ, విజన్‌తో పనిచేశారు. ఇళయరాజా గారు కంపోజ్ చేసిన పాటల్లో ప్రతి పాటకు ఓ ఎమోషన్ ఉంటుంది. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాజమండ్రిలో నెలరోజులకు పైగా షూటింగ్ చేశాం.
గోదావరిని మరింత అందంగా చూపించారు. తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే సినిమా ఇది. అందుకే షూటింగ్ టైమ్‌లో మా నాన్న గుర్తొచ్చారు. నేను ఆయన్ను చాలా మిస్ అయ్యాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు కుటుంబ సమేతంగా చూడాలి. ఓ మంచి నటిగా జనం గుర్తు పెట్టుకునే పాత్రలు, కథలను ఎంచుకుంటున్నాను. అన్ని జానర్స్‌లో నటించాలనుంది. అయితే యాక్షన్ సినిమాలపై ఎక్కువ ఇష్టం. ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీ చేస్తున్నా. తమిళంలో ఓ సినిమా జరుగుతోంది.’’