దోపిడీకి స్కెచ్ వేసి దొరికిపోయారు

దోపిడీకి స్కెచ్ వేసి దొరికిపోయారు

పాతబస్తీలో దోపిడీ దొంగల ముఠా ఆటకట్టించారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మారణాయుధాలతో దోపిడీలకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో బుధవారం ఐదుగురు సభ్యుల ముఠాను  పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీలో భారీ దోపిడీకి స్కెచ్ వేసిన ఈ  దొంగల ముఠా వివరాలను అడిషనల్ డీసీపీ,టాస్క్ ఫోర్స్ ఎస్.చైతన్యకుమార్ వెల్లడించారు.

రౌడీ షీటర్.. అక్బర్ అలీ
పాతబస్తీలోని యాకుత్ పురకు చెందిన రౌడీ షీటర్ మీర్ అక్బర్ అలీ(24) ఓ మర్డర్ కేసుతో పాటు మరో 12 కేసుల్లో నిందితుడుగా పోలీస్ రికార్డ్స్ లో ఉన్నాడు. అక్బర్ అలీపై  పీడీ యాక్ట్  నమోదవ్వడంతో జైలుకు కూడా వెళ్లాడు. 3 నెలల క్రితం అక్బర్ అలీ జైలు నుంచి విడుదలయ్యాడు. యాకుత్ పురకు చెందిన మహ్మద్ ముజఫర్(25), మాదన్నపేట కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ హుస్సేన్(20), మహ్మద్ అబ్దుల్ హసన్(28), బాలాపూర్ రాయల్ కాలనీకి చెందిన మహ్మద్ రఫీ(21)ని అక్బర్ అలీ తనకు అనుచరులుగా చేసుకున్నాడు. వీరితో కలిసి అలీ చోరీలు చేసేవాడు. అక్బర్ అలీ ముఠా స్థానికంగా బెదిరింపులతో పాటు  దాడులకు సైతం పాల్పడేది. అక్బర్ అలీతో పాటు ఇర్ఫాన్ హసన్ పై రౌడీ షీట్లు ఓపెన్ అయ్యాయి. మరో నిందితుడు ముజఫర్ పై భవానీనగర్ పోలీస్ స్టేషన్ లో హిస్టరీ షీట్ నమోదైంది. రఫీ,అబ్దుల్ హసన్ మరో నాలుగు చోరీ కేసుల్లో నిందితులుగా పోలీస్ రికార్డ్స్ లో ఉన్నారు.

దోపిడీలకు ప్లాన్
చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ అక్బర్ అలీ గ్యాంగ్ డబ్బు కోసం చోరీలు చేసేది.  వరుస చోరీలు, దాడులు చేస్తూ ఈ ముఠా సభ్యులు జైలుకెళ్లారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ముఠా దారి దోపిడీలు చేయడం మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ లో శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జువెలరీ షాపు ఓనర్ ను  అక్బర్ ముఠా వెంబడించింది. ఆ షాప్ ఓనర్ ను బెదిరించి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇదే తరహాలో మరికొన్ని దోపిడీలు చేసేందుకు ప్లాన్ వేశారు. అందుకోసం నాందేడ్ వెళ్లి ఓ వెహికల్ ను, రాడ్ ల మాదిరిగా ఉండే డాగర్లను కొన్నారు.

పాతబస్తీలోని వ్యాపారులను టార్గెట్ చేసి దోచుకునేందుకు ప్లాన్ చేశారు. రాత్రి వేళల్లో షాపులు మూసివేసి ఇండ్లకు వెళ్లే వ్యాపారస్థులను దోపిడీ చేసేందుకు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి అక్బర్ అలీ గ్యాంగ్ యాకుత్ పుర రైల్వే స్టేషన్ వద్ద దారిదోపిడీకి స్కెచ్ వేసింది. అర్ధరాత్రి అక్కడి నుంచి వెళ్లే వ్యాపారస్థులను దోచుకునేందుకు ఐదుగురు సభ్యులు గల  అక్బర్ అలీ ముఠా సభ్యులు రైల్వే స్టేషన్ సమీపంలో సంచరిస్తున్నారు. అక్బర్ అలీ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు దోపిడీ విషయం తెలిసింది.

దీంతో రెయిన్ బజార్ పోలీసులతో పాటు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ మధుమోహన్ రెడ్డి టీమ్ తనిఖీలు చేపట్టింది.  ఈ తనిఖీల్లో భాగంగా రైల్వే స్టేషన్ సమీపంలో అక్బర్ అలీతో పాటు అతడి ముఠాకు చెందిన మహ్మద్ ముజఫర్, ఇర్ఫాన్ హుస్సేన్, మహ్మద్ అబ్దుల్ హసన్, మహ్మద్ రఫీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి 5 డాగర్స్, 2 మిర్చి పౌడర్ ప్యాకెట్లు, కుక్లె డస్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్బర్ గ్యాంగ్ ను పోలీసులకు చిక్కకుండా ఉండి ఉంటే వ్యాపారస్థులను టార్గెట్ చేసి వారి కళ్లల్లో కారం చల్లి దోపిడీ పాల్పడేదని పోలీసులు తెలిపారు