Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ.. 'శివుడి ఆజ్ఞ కోసం చూస్తున్నాం!'

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ.. 'శివుడి ఆజ్ఞ కోసం చూస్తున్నాం!'

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి గత దశాబ్ద కాలంగా అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఒకటే ఉత్కంఠ. "బాహుబలి"తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆయన పెళ్లి వార్తలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అప్పటి నుండి, ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో పుకార్లు, ఊహాగానాలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన వ్యాఖ్యలు  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

దైవ చిత్తం ప్రకారమే..
సోమవారం, శ్యామలాదేవి తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభాస్ పెళ్లిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త చెప్పారు. స్వామివారికి ఇక్కడ పూజలు చేయడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. ఆ దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే, మనకు ఏం కావాలో ఆయనే చూసుకుంటారు. ప్రభాస్ పెళ్లి గురించే అందరూ అడుగుతున్నారు. తప్పకుండా బాబుకు పెళ్లి చేయాలని చూస్తున్నాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. భగవంతుడి ఆజ్ఞ కోసం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఆ పెళ్లి జరుగుతుంది. తప్పకుండా ఆ శుభసమయం వస్తుంది అని ఆమె తెలిపారు.

వధువు ఎవరు?
శ్యామలాదేవి వ్యాఖ్యలు ప్రభాస్ పెళ్లిపై నెలకొన్న సందిగ్ధతకు కొంతవరకు తెరదించాయి. అయితే, ఆమె మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. వధువు ఎవరు అనేది తనకు ఇంకా తెలియదని చెప్పారు. ప్రభాస్‌కు ఇండస్ట్రీలోని అమ్మాయా, లేక బంధువుల అమ్మాయా అనేది తెలియదు. కానీ, పెళ్లి మాత్రం జరుగుతుంది అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల ఉత్కంఠ మరింత పెరిగింది. గతంలో ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల పేర్లు వినిపించినా, ఇప్పుడు శ్యామలాదేవి ప్రకటనతో ఆ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఏదేమైనా, ప్రభాస్ పెళ్లికి ముహూర్తం దగ్గర్లో ఉందని స్పష్టమవుతోంది. అది ఎప్పుడు అనేది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉందని పెద్దమ్మ చెప్పడం అభిమానులకు కొంత ఉత్సహాన్ని ఇచ్చింది. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులంతా ఆనందంలో మునిగిపోయారు.