ప్రభుత్వాలు మారినా ముస్లింల బతుకులు మారలే : అక్బరుద్దీన్​ ఒవైసీ

ప్రభుత్వాలు మారినా ముస్లింల బతుకులు మారలే :  అక్బరుద్దీన్​ ఒవైసీ
  • ప్రభుత్వాలు మారినా ముస్లింల బతుకులు మారలే
  • ఓల్డ్​సిటీని అభివృద్ధి చేయాలి: అక్బరుద్దీన్​ ఒవైసీ
  • ముస్లింలకు మేలు చేశారు కాబట్టే వైఎస్​కు మద్దతు ఇచ్చామని కామెంట్​ 

హైదరాబాద్, వెలుగు : ముస్లింలు వాళ్లను గెలిపించారు.. వీళ్లనూ గెలిపించారు  కానీ, వాళ్లెవరూ ముస్లింలను గెలిపించలేదని అధికార ప్రతిపక్షాలనుద్దేశించి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ఒవైసీ వ్యాఖ్యానించారు. ముస్లింల జీవితాలు బాగుపడలేదని, ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని పేర్కొన్నారు. వాళ్లు ఒకప్పుడు ఎక్కడున్నారో ఇప్పటికీ అక్కడే ఉన్నారని, ఏ మాత్రం పురోగతి లేదని చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ముస్లింల బతుకులు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు కాదని, వారంతా దేశ పౌరులేనని గుర్తు చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడారు. 

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మొత్తం రూ.3,16,185 కోట్లు అవసరమవుతాయన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని16 సార్లు పాలించిన కాంగ్రెస్​ పార్టీ ఆ హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతుందని ఎద్దేవా చేశారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ఇస్తామంటున్నారని, మరి 201 యూనిట్లు కరెంటు కాలితే పరిస్థితేంటని ఒవైసీ ప్రశ్నించారు. 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చి.. మిగతా యూనిట్లకు బిల్లు వసూలు చేస్తారా? లేదా మొత్తం యూనిట్లకు బిల్లు వేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. యువవికాసం స్కీంను మైనారిటీలకూ వర్తింపజేస్తారా లేదా అని ప్రశ్నించారు. డయాలసిస్​పేషెంట్లకు డయాలసిస్​ చేసే పైపులూ దొరకడం లేదన్నారు. దానికితోడు క్రియాటినిన్​టెస్టుల కోసం సెపరేట్​గా డబ్బులు పెట్టాల్సి వస్తున్నదని, అది బాధితులకు భారంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. 

హాస్పిటల్స్​కు పాత బిల్లులేనా..

ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లిస్తున్న బిల్లుల రేట్లు వైఎస్​ హయాంలో నిర్ణయించినవేనని, ఆ రేట్లను పెంచాలని అక్బరుద్దీన్​ డిమాండ్​ చేశారు. బిల్లులు చెల్లిస్తున్నప్పుడు చాలా వరకు థర్డ్​ పార్టీకే అందుతున్నాయని, ఆసుపత్రుల దాకా చేరడం లేదని అన్నారు. పాతబస్తీలో రోడ్లను వెడల్పు చేయాలని డిమాండ్​ చేశారు. ఓల్డ్​ సిటీలోనూ ఐటీ టవర్స్ ​కట్టాలని, మూసీని సుందరీకరించాలన్నారు. చార్మినార్​ పెడస్ర్టనైజేషన్​ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్​ చేశారు. విద్యార్థుల స్కాలర్​షిప్​లు రిలీజ్​ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ముస్లిం డెలిగేషన్​ను పిలిపించుకుని మదర్సా బోర్డును ఏర్పాటు చేసి పేద మౌలానాలకు గౌరవ వేతనాలు ఇవ్వాలన్నారు. షాదీ ముబారక్​ పెండింగ్​దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఆలేరు ఎన్​కౌంటర్​పై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. 

ఓల్డ్​ సిటీకి చెందిన ఎమ్మెల్యేలందరితో ఓ సమావేశం ఏర్పాటు చేసి పాతబస్తీ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్​ను విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ నియామక పరీక్షలను ఉర్దూలోనూ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. డీఎస్సీలో ఉర్దూ పోస్టులను త్వరగా భర్తీ చేయాలన్నారు. ముస్లింలకు మేలు చేశారు కాబట్టే వైఎస్ ​రాజశేఖర్​ రెడ్డికి అప్పట్లో మద్దతుగా ఉన్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ​ఇంకా ఎన్నికల మూడ్​లోనే ఉందని, తన 25 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గవర్నర్​ ప్రసంగం తానెప్పుడూ చూడలేదన్నారు. 

ముస్లింలకు12% రిజర్వేషన్ల గురించి ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కాంగ్రెస్​పార్టీ.. మేనిఫెస్టోలో మాత్రం ఎందుకు పెట్టలేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లున్నాయని, వాటిని కలిపితే 72 శాతానికి రిజర్వేషన్లు చేరుతాయన్నారు. ముస్లింలకు 12 శాతం, ఈబీసీలకు10 శాతం ఇస్తే 92 శాతానికి చేరుతాయన్నారు.

బిన్​ఫ్రీ సిటీ అన్నరు.. కాలేదు

గత ప్రభుత్వం బిన్​ఫ్రీ సిటీ అని చెత్త డబ్బాలన్నీ ఎత్తేసిందని, బిన్నులు లేవుగానీ చెత్త మాత్రం రోడ్డు మీదనే ఉంటున్నదని అక్బరుద్దీన్​అన్నారు. ఓల్డ్​సిటీలోనూ ఫ్లై ఓవర్లు, అండర్​పాసులు, మెట్రో వంటివీ తమకు కావాలన్నారు. చార్మినార్​దగ్గర ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుందని, దాన్ని బాగు చేయాలని డిమాండ్​ చేశారు. అసెంబ్లీ సమావేశాలను పెంచాలని ఆయన డిమాండ్​ చేశారు. పొరుగు రాష్ట్రం ఏపీలో 40 రోజుల పాటు సమావేశాలు జరిగితే మన దగ్గర మాత్రం చాలా తక్కువ దినాలు నడుస్తున్నదని గుర్తు చేశారు.