న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఎన్నికల మేనేజ్‌మెంట్ సంస్థ ‘ఐ-ప్యాక్’తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. నిధుల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు బుధవారం మీడియాతో అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు. ‘‘మా వద్ద సరిపడా నిధులు లేవు. ఒకవేళ మీడియా వారే మాకు నిధులు ఇస్తే, మరో కంపెనీని నియమించుకుంటాం’’ అని చమత్కరించారు. అయితే, సోషల్ మీడియా పనుల కోసం ‘షో టైమ్’ అనే మరో సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మాత్రం కొనసాగుతుందని సమాచారం.
ఐ-ప్యాక్ వైఫల్యాలు.. వినేశ్ చందేల్ అరెస్ట్ ప్రభావం!
ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఐ-ప్యాక్ వ్యూహాలు ఫలించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్ తమ కంచుకోటల్లోనే ఓటమి పాలుకావడం ఐప్యాక్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. మరోవైపు, ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ చందేల్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ కావడం కూడా ఎస్పీని పునరాలోచనలో పడేసినట్టు తెలుస్తోంది.
