- ఇందిరాపార్కు వద్ద అక్షర చిట్‌ఫండ్ బాధితుల ఆందోళన
- సంస్థ ఆస్తులను అటాచ్ చేసి న్యాయం చేయాలని డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: అక్షర చిట్‌ఫండ్, అక్షర టౌన్‌షిప్స్ సంస్థల ఆర్థిక మోసాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని తెలంగాణ చిట్‌ఫండ్ కంపెనీల బాధితుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బాధితుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహించిన అక్షర సంస్థలు..18 శాతం రాబడి పేరుతో వేలాది మందిని ఆకర్షించి వందల కోట్ల నిధులను ఇతర స్కీములకు మళ్లించారని ఆరోపించారు.
గత నాలుగేండ్లుగా చెల్లింపులు నిలిచిపోయాయని, యాజమాన్యంపై 100కు పైగా కేసులు, 20 నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉండగా, వారు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. సుమారు 5,000 కుటుంబాలు ఈ మోసం వల్ల రోడ్డున పడ్డాయని, వెంటనే సంస్థ ఆస్తులను అటాచ్ చేసి తమ పెట్టుబడులను తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
