సీఎం కేసీఆర్​కు ఎవరైనా ప్రశ్నిస్తే నచ్చదు.. : ఆకునూరి మురళీ

సీఎం కేసీఆర్​కు ఎవరైనా ప్రశ్నిస్తే నచ్చదు.. : ఆకునూరి మురళీ

సీఎం కేసీఆర్​కు ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే నచ్చదని రిటైర్డ్​ ఐఏఎస్​ ఆఫీసర్​ ఆకునూరి మురళీ విమర్శించారు. సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో సోషల్​ డెమొక్రటిక్​ ఫోరం ఆధ్వర్యంలో 'తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎలా?'  అనే అంశంపై రౌండ్​టేబుల్​సమావేశం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మురళీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్యా అందించట్లేదని ఆరోపించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా హక్కు చట్టాన్ని మొక్క బడిగా అమలు చేస్తున్నారన్నారు. విద్యా నాణ్యతలో రాష్ట్రం దేశంలోనే చివరి నుంచి రెండో స్థానంలో ఉందన్నారు. 60 శాతం పర్సంటేజీతో పదో తరగతి పాస్​ అవుతున్న విద్యార్థులు ఇంటర్​ వరకు వచ్చే సరికి మొత్తానికి స్కిల్స్ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ALSO READ :అధికార పార్టీ నేతల కోసం.. కొండగట్టు అంజన్న దర్శనాలు నిలిపివేత

ఖాళీల భర్తీ ఎప్పుడు..

విద్యా రంగంలో ఖాళీలు భర్తీ చేయడంలో సీఎం కేసీఆర్​ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆకునూరి మురళీ ఆరోపించారు. 11 యూనివర్సిటీల్లో అసిస్టెంట్​ప్రొఫెసర్ల నియామకాలు ఆగిపోయాయన్నారు. వర్సిటీల్లో 3,179 పోస్టులకు గానూ 818 ప్రొఫెసర్, లెక్చరర్​ పోస్టులు మాత్రమే భర్తీ జరిగినట్లు చెప్పారు.  మిగతా 74 శాతం ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా నాణ్యమైన విద్య అందించట్లేదన్నారు. తెలంగాణ విద్యా సంస్థలకు కేంద్రం బడ్జెట్​లో కేవలం 2.5 శాతమే కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణకు 15 శాతం బడ్జెట్​ కేటాయించాలని డిమాండ్​ చేశారు.  విద్యావ్యవస్థను బాగు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. అనంతరం పుస్తకావిష్కరణ చేశారు. 

విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. : శాంత సిన్హా

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని బాలల హక్కుల కమిషన్​ మాజీ ఛైర్మన్​ ప్రొఫెసర్​ శాంత సిన్హా విమర్శించారు. రాష్ట్రంలో ఆ రంగానికి నిధులు పెంచాలన్న ఆవశ్యకతను తెలియజేశారు.