టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆకునూరి మురళి.?

టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆకునూరి మురళి.?

 

  • పారదర్శక పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు
  •  పొరుగు  రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారులు
  • యూపీఎస్సీ విధానాలనూ స్టడీ చేసేందుకు టీమ్
  • విమర్శల్లేకుండా ఉద్యోగాల భర్తీకి చర్యలు

హైదరాబాద్: టీఎస్పీఎస్పీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న చైర్మన్, సభ్యులు రాజీనామా చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. కొత్త కమిషన్ ఏర్పాటునకు గైడ్ లైన్స్ రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన గత కొంత కాలంగా విద్యా, వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించి పేదలు, ఆదివాసీల మన్ననలు పొందారు. కేసీఆర్  ప్రభుత్వంలో అణిచి వేతలకు గురైన ఆయన స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు. ఆకునూరి ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలో ఆయన సేవలను వినియోగించుకొంది. విద్య, మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమించింది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన ఏపీలో మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. పిల్లలకు ఇంగ్లీషు మీడియం అమలునూ విజయవంతం చేయగలిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మన ఊరు–మన బడి కార్యక్రమాన్నిఇంప్లిమెంట్ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సమయంలోనూ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ లోపాలను ఎత్తి చూపారు. 

ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయంలో బ్యాక్ ఎండ్ గా ఉన్న ఆకునూరి మురళికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా అపారమైన అనుభవం, విద్యా రంగం పట్ల మక్కువ, నిరుద్యోగుల పట్ల కన్సర్న్ ఉన్న మురళికి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మురళి నియమించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు యోగ్యుడైన మేధావికి పదవిని కట్టబెట్టినట్టు ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. పైగా ఆకునూరి మురళి స్వస్థలం మంచిర్యాల జిల్లా కావడంతో స్థానికుడికే అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పాలకమండలి కూర్పు సైతం పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఉంటుందనే వాదన నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది.