
- కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్ కైవసం.. తిరిగి వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సొంతం
న్యూయార్క్: సమ ఉజ్జీల సమరంలో.. ఈ తరం అత్యుత్తమ ఆటగాళ్ల పోరులో వరల్డ్ నంబర్ వన్‌పై రెండో ర్యాంకర్‌దే పైచేయి అయింది. వింబుల్డన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ టెన్నిస్ సింహాసనాన్ని స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ మళ్ళీ అధిరోహించాడు. టెన్నిస్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో తన ప్రత్యర్థి, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్‌పై అద్భుత విజయంతో ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు. తన దూకుడైన ఆటతో సినర్ జోరుకు బ్రేక్ వేసి తిరిగి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు.
శనివారం అర్ధరాత్రి ఆర్థర్ ఆషే స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య జరిగిన ఫైనల్ పోరులో రెండో సీడ్ అల్కరాజ్ 6–-2, 3-–6, 6-–1, 6-–4తో టాప్ సీడ్ ఇటలీ స్టార్ సినర్ పై గెలుపొందాడు. గ్రాండ్‌స్లామ్ హార్డ్ కోర్టుల్లో సినర్ 28 మ్యాచ్‌ల అప్రతిహత విజయ పరంపరకు అల్కరాజ్ తెరదించాడు. 22 ఏండ్ల అల్కరాజ్‌కు ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ కాగా, మొత్తంగా ఆరో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.
అల్కరాజ్ అదిరే ఆట
ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరుకున్న స్పెయిన్ స్టార్ అల్కరాజ్ తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాడు. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్ల కారణంగా ప్రేక్షకులు స్టేడియంలోకి ఆలస్యంగా చేరుకోవడంతో మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ అల్కరాజ్ ఏకాగ్రత చెదరలేదు. తొలి సెట్‌లో సినర్ తడబడగా అల్కరాజ్ ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. పదునైన సర్వీసులు, పవర్‌ఫుల్ బేస్‌లైన్ షాట్లతో టాప్ ర్యాంకర్ సినర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. బుల్లెట్లలాంటి ఫోర్ హ్యాండ్ విన్నర్లతో తొమ్మిది నిమిషాల్లోనే తొలి బ్రేక్ పాయింట్ అందుకున్నాడు. మరో బ్రేక్ సాధించి 5-–2 ఆధిక్యంలోకి వెళ్లిన అతను కేవలం 37 నిమిషాల్లోనే సెట్ నెగ్గాడు. కానీ, రెండో సెట్‌లో సినర్ పుంజుకుని, తన సహజమైన ఆటతీరుతో అల్కరాజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు.
ఓ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో 3–-1 వద్ద కీలకమైన బ్రేక్ అందుకున్న సినర్ వరుసగా ఐదు సర్వీస్ గేమ్‌లను కాపాడుకుని సెట్ నెగ్గాడు. ఈ టోర్నమెంట్‌లో అల్కరాజ్ నుంచి ఒక సెట్‌ను గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించారు. కానీ, అల్కరాజ్ తనలోని అసలు సిసలైన చాంపియన్‌ను బయటకు తీశాడు. మూడో సెట్ స్టార్టింగ్ లోనే యానిక్ సర్వీస్ బ్రేక్ చేయడమే కాకుండా టోర్నమెంట్‌కే హైలైట్‌గా నిలిచే ఒక అద్భుతమైన ఓవర్‌హెడ్ షాట్ ఆడాడు.
4–-0 వద్ద మరోసారి బ్రేక్ సాధించి, సెట్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌పై పట్టు బిగించాడు. ఇక నాలుగో సెట్‌లో పూర్తి నియంత్రణ, పట్టుదల చూపెట్టిన కార్లోస్ తన నిప్పులు చెరిగే సర్వీసులతో సినర్‌కు ఏ అవకాశం ఇవ్వలేదు. తెలివైన స్లైస్, డ్రాప్ షాట్స్ వేస్తూ యానిక్ ను పూర్తిగా నిస్సహాయుడిని చేశాడు. 3-–2 వద్ద నిర్ణయాత్మక బ్రేక్ సాధించిన తర్వాత ప్రశాంతంగా తన సర్వీస్ గేమ్‌లను కాపాడుకున్నాడు. చివరికి మూడో చాంపియన్‌షిప్ పాయింట్‌పై తన 11వ ఏస్‌తో మ్యాచ్‌ను ముగించి విజయగర్వంతో నిలిచాడు.
- 1 ఈ విజయంతో అల్కరాజ్ సెప్టెంబర్ 2023 తర్వాత మళ్లీ వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు. 65 వారాల పాటు టాప్ ప్లేస్ లో ఉన్న సినర్ ను రెండో ర్యాంక్ కు నెట్టాడు.
- 2 మెన్స్ సింగిల్స్ లో ఆరు మేజర్ టైటిళ్లను గెలుచుకున్న రెండో యంగెస్ట్ ప్లేయర్ గా 22 ఏండ్ల అల్కరాజ్ నిలిచాడు. స్వీడన్ లెజెండ్ బోర్న్ బోర్గ్ ముందున్నాడు.
- 4 వేర్వేరు (హార్డ్, క్లే, గ్రాస్) కోర్టుల్లో రెండు, అంతకంటే ఎక్కువ మేజర్ టైటిళ్లు గెలుచుకున్న నాలుగో ఆటగాడిగా నొవాక్ జొకోవిచ్, రఫెల్ నడాల్, మాట్స్ విలాండర్ సరసన అల్కరాజ్ నిలిచాడు.
- 10-–5 సినర్‌తో హెడ్ టు హెడ్ లో తన రికార్డును అల్కరాజ్ ఇప్పుడు 10-–5కు పెంచుకున్నాడు. సినర్ తో జరిగిన గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింటిలో అల్కరాజే విజయం సాధించడం విశేషం.