
మహాత్మాగాందీజీ కలలు కన్న స్వరాజ్యం ఏపీలో జరుగుతుందన్నారు ఎమ్మెల్యే రోజా. మద్యపాన నిషేధంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు అవుతుందని.. నారావారి సారా పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. చంద్రబాబు హయాంలో సరైన వర్షాలు పడలేదని.. కృష్ణానదికి ఏనాడు వరద రాలేదన్నారు.
విజన్ 2020 కాదు…విజన్ 420
రాష్ట్రంలో మాత్రం మద్యం ఏరులై పారిందన్న ఆమె.. చంద్రబాబుది విజన్ 2020 కాదు…విజన్ 420 అన్నారు. అయిదేళ్లలో రూ.75వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని చెప్పిన రోజా.. మరి చంద్రబాబుకు మద్యం అంటే అంత మక్కువ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. మద్యం వల్ల పేదవాళ్ల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయని.. అన్నిటీకి అనర్థం మద్యమేనన్నారు. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది కుటుంబాలు అన్యాయం అయిపోయాయని సీరియస్ అయ్యారు.
ఆరు నెలల్లోనే దశలవారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. 43వేల బెల్ట్ షాపులను తొలగించి, 40 శాతం బార్లు కూడా తగ్గించారని తెలిపారు. గతంలో ఉన్న నాలుగువేలకు పైగా పర్మిట్ రూమ్ లను తొలగించారని.. ఇచ్చిన మాటను జగన్ అమలు చేశారని తెలిపారు. ఇన్నాళ్లు చరిత్రను విన్నాం, చదివాం. మొట్టమొదటిసారిగా సీఎం జగన్ పాలనలో చరిత్రను రాయడం చూస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే రాజా.
పులిహోర తింటే పులులు కారు
వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేసిన విమర్శలకు కౌంటర్ వేశారు రోజా. పులిహోర తిన్నంత మాత్రాన పులులు అయిపోరని తెలిపారు రోజా. ఎన్ని కష్టాలు వచ్చినా, అక్రమ కేసులు బనాయించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైఎస్ జగన్ చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజల హృదయాలను గెలుచుకుని సీఎం అయ్యారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ సీఎం నెరవేర్చుతున్నారని.. అలాంటివారిని పులి అంటారు కానీ… పులిహోర బ్యాచ్‌ను పులి అనరని చెప్పారు రోజా.
ముఖ్యమంత్రి కాదు సారీ..ప్రతిపక్ష నాయకుడు
మద్యపానం నిషేధంపై అసెంబ్లీలో చంద్రబాబు గురించి మాట్లాడుతున్న క్రమంలో పొరపాటున చంద్రబాబును రోజా ముఖ్యమంత్రి అన్నారు. ఈ రోజు సభలో ముఖ్యమంత్రి గారు లేరని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన రోజా.. టక్కున నోరు కరుచుకుని సారీ .. ప్రతిపక్ష నాయకుడు అని మిస్టేక్ ను వెంటనే కవర్ చేశారు రోజా.