శానిటైజర్లు తాగుతున్నారని లిక్కర్ రేట్లు తగ్గించిన ఏపీ

శానిటైజర్లు తాగుతున్నారని లిక్కర్ రేట్లు తగ్గించిన ఏపీ

అమరావతి:  రాష్ట్రంలో మద్యం ధరలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో మార్పులు చేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న మద్యం ధరలను తగ్గించారు. 90ఎంఎల్‌ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచారు. 60ఎంఎల్‌ నుంచి 190  ఎంఎల్‌ వరకు ధరలు తగ్గించింది.  రూ.190 నుంచి రూ.210 వరకు ఉన్న 180 ఎంఎల్‌ మద్యం ధరలను  పెంచింది.  అన్ని రకాల బీర్ల ధరలను రూ.30 మేర తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

ఇవాళ్టి(గురువారం) నుంచి సవరించిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ధరలు సవరించాలని ప్రభుత్వానికి ఎస్ఈబీ సిఫార్సు చేసింది. శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, ధరలు సవరించాల్సిందిగా ప్రభుత్వానికి ఎస్ఈబీ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.

ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ.. దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించిన విషయం తెలిసిందే.