CPL 2025: 14 వేల పరుగుల క్లబ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్.. ప్రమాదంలో గేల్ ఆల్‌టైం రికార్డ్

CPL 2025: 14 వేల పరుగుల క్లబ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్.. ప్రమాదంలో గేల్ ఆల్‌టైం రికార్డ్

ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్స్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టులో కోల్పోయినా.. ఐపీఎల్ లో ఆడకపోయినా దాదాపు ప్రపంచంలోని అన్ని టీ20 లీగ్ లు ఆడుతూ పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో హేల్స్ ఒక అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో 14000 వేల పరుగులు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. ఇటీవలే జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ లో 500 మ్యాచ్ లాడి చరిత్ర సృష్టించిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్ గా నిలిచిన హేల్స్.. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో 14 వేల పరుగుల క్లబ్ లో స్థానం సంపాదించాడు. 

ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న అలెక్స్ హేల్స్ ఆదివారం (ఆగస్టు 31) గయానా అమెజాన్ వారియర్స్‌పై ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో హేల్స్ 43 బంతుల్లోనే 74 పరుగులు చేసి తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. క్రిస్ గేల్, కీరాన్ పొలార్డ్ మాత్రమే ఇప్పటివరకు టీ20 క్రికెట్ లో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు టీ20 క్రికెట్ లో క్రిస్ గేల్ 14562 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు.  రెండో స్థానంలో  పొలార్డ్ (14024) ఉండగా.. మూడో స్థానంలో హేల్స్ (14012) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు: 

క్రిస్ గేల్: 14562 పరుగులు

కీరన్ పొలార్డ్: 14024 పరుగులు

అలెక్స్ హేల్స్: 14012 పరుగులు

డేవిడ్ వార్నర్: 13595 పరుగులు

షోయబ్ మాలిక్ : 13571 పరుగులు

ఈ మ్యాచ్ విషయానికి వస్తే గయానా అమెజాన్ వారియర్స్ పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయం సాధించింది.