బర్మింగ్‌హామ్: ఫిలిప్పీన్స్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండ్రా ఈలా బర్మింగ్‌హామ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో టాప్ సీడ్ ఈలా 5-–7, 6–-3, 7-–5 తేడాతో తన డబుల్స్ భాగస్వామి నికోలా బార్టుంకోవాపై ఘన విజయం సాధించింది. ఈలా కెరీర్‌లో ఇది రెండో డబ్ల్యూటీఏ 125 సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.
మొదటి సెట్ కోల్పోయినప్పటికీ ఈలా అద్భుతమైన పునరాగమనంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గతేడాది మయామి ఓపెన్ సెమీఫైనల్స్‌కు చేరడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 21 ఏళ్ల ఈలా.. యూఎస్ ఓపెన్‌లో క్లారా టాసన్‌ను ఓడించి మేజర్ టోర్నమెంట్‌లో తొలి విజయం నమోదు చేసింది.
గ్వాడలజారా 125 ఓపెన్ గెలవడం ద్వారా ఫిలిప్పీన్స్ తరఫున చాలెంజర్ స్థాయి డబ్ల్యూటీఏ టైటిల్ సాధించిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. స్పెయిన్‌లోని రాఫా నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈలా.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.
