V6 News

ప్రత్యేక అవసరాల పిల్లలకు..త్వరలో ఉపకరణాల పంపిణీ

ప్రత్యేక అవసరాల పిల్లలకు..త్వరలో ఉపకరణాల పంపిణీ
  •     రాష్ట్ర వ్యాప్తంగా 5,759 మంది గుర్తింపు
  •     మే 11 నుంచి 22 వరకు క్యాంపుల నిర్వహణ
  •     ప్రజాపాలన విద్యా వారోత్సవాల్లో పంపిణీ 

మెదక్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ఏఎల్‌‌ఐఎంసీఓ) ద్వారా రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచితంగా సహాయక పరికరాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. శారీరక, మానసిక వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన ఉపకరణాలను సమగ్ర శిక్ష అభియాన్‌‌(ఎస్‌‌ఎస్‌‌ఏ) కింద అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

గతేడాది ఆగస్టులో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పిల్లలను పరీక్షించారు. ఈ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 629 మండలాల్లో మొత్తం 5,759 మంది పిల్లలకు ప్రత్యేక అవసరాలు ఉన్నట్టు గుర్తించారు. వారికి అవసరమైన కృత్రిమ అవయవాలు, వీల్‌‌చైర్లు, వినికిడి యంత్రాలు తదితర పరికరాల కోసం కొలతలు తీసుకున్నారు. త్వరలోనే ఈ పరికరాలను పంపిణీ చేయనున్నారు.

జిల్లాలవారీగా ఇలా..

ఆదిలాబాద్‌‌లో 250, భద్రాద్రి కొత్తగూడెం 308, హన్మకొండ 153, హైదరాబాద్ 349, జగిత్యాల 124, జనగామ 123, జయశంకర్ భూపాలపల్లి 55, జోగులాంబ గద్వాల 169, కామారెడ్డి 188, కరీంనగర్ 254, ఖమ్మం 534, కుమ్రంభీం ఆసిఫాబాద్ 184, మహబూబాబాద్ 98, మహబూబ్‌‌నగర్ 172, మంచిర్యాల 152, మెదక్ 125, మెడ్చల్ మల్కాజిగిరి 88, ములుగు 46, నాగర్‌‌కర్నూల్ 81, నల్గొండ 190, నారాయణపేట్ 95, నిర్మల్ 193, నిజామాబాద్ 393, పెద్దపల్లి 75, రాజన్న సిరిసిల్ల 84, రంగారెడ్డి 128, సంగారెడ్డి 277, సిద్దిపేట 132, సూర్యాపేట 230, వికారాబాద్ 196, వనపర్తి 66, వరంగల్ 99, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 148 మంది పిల్లలను గుర్తించారు.

మే 11 నుంచి శిబిరాలు..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. అదే రోజు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌‌నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్‌‌లో శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మే 13న నిర్మల్, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో, 15న కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో, 18న సంగారెడ్డి, మెడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో, 20న వికారాబాద్, నారాయణపేట, సిద్దిపేట జిల్లాల్లో, 22న జనగామ జిల్లాలో శిబిరాలు నిర్వహిస్తారు. 

ఈ శిబిరాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా పరికరాలు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎల్‌‌ఐఎంసీఓ క్యాంపుల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.43.95 కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక అవసరాల పిల్లలను శిబిరాలకు తరలించేందుకు రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలని కూడా ఆదేశించారు.