- రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం
- రోగిని తరలించే క్రమంలో కూలిపోయిన విమానం
న్యూఢిల్లీ: జార్ఖండ్ లో పేషెంట్ ను తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం.. 23 నిమిషాల తర్వాత కూలినట్లు డీజీసీఏ తెలిపింది. విమానంలో రోగితో పాటు ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్, ఇద్దరు సహాయకులుసహా మొత్తం ఏడుగురు ఉన్నారని పేర్కొంది. వారంతా మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఓ ప్రమాదంలో కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన 41 ఏళ్ల వ్యక్తి పరిస్థితి సీరియస్ గా మారింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతడిని ఢిల్లీలోని మరో ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు నిర్ణయించారు.
రెడ్ బర్డ్ ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన బీచ్ క్రాఫ్ట్ విమానం (ఎయిర్ అంబులెన్స్) లో అతడిని తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం 7:11 గంటలకు రోగిని ఎక్కించుకుని ఎయిర్ అంబులెన్స్ రాంచీ నుంచి బయలుదేరింది. రాత్రి 7:34 గంటలకు కోల్ కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) కు విమానంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కనిపించకుండా పోయిన లొకేషన్ కు జిల్లా యంత్రాంగం, డీజీసీఏ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ చేరుకుని గాలిస్తున్నారు.
