ఐ బొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి గురించి తవ్వే కొద్దీ బయటపడుతున్న నిజాలు !

ఐ బొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి గురించి తవ్వే కొద్దీ బయటపడుతున్న నిజాలు !
  • 34 హార్డ్ డిస్కులు..  21 వేల సినిమాలు
  • ఐ బొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి సంపాదన రూ. 20 కోట్లు
  • ఫ్రీగా సినిమాలు చూపెట్టి.. జనం పర్సనల్​ డేటా చోరీ బెట్టింగ్​ యాప్స్​ ప్రమోషన్​కు ఆ డేటా వాడుతున్నడు మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్​ వెల్లడి
  • ఇల్లీగల్​ పనులు చేస్తూ తోపు అంటే చట్టం ఊరుకోదని హెచ్చరిక
  • పైరసీ వల్ల ఎందరో నష్టపోతున్నారు: చిరంజీవి
  • అమాయకులు సైబర్​ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం: ​ రాజమౌళి
  • మా ఫ్యామిలీ మెంబర్​ కూడా డిజిటల్​ అరెస్ట్​ బారినపడ్డారు: నాగార్జున

హైదరాబాద్ సిటీ, వెలుగు: పైరసీ సినిమాల వెబ్​సైట్​ ఐబొమ్మను ఇమ్మడి రవి  2019 నుంచి నిర్వహిస్తున్నాడని.. మొత్తం 61 వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లు, 110 డొమైన్లు అతడి వద్ద ఉన్నాయని హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ తెలిపారు. ఒక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్లాక్ చేస్తే మరో వెబ్​సైట్​ఓపెన్​ చేస్తాడని, అలా 65 మిర్రర్ సైట్లు సిద్ధంగా ఉంచుకునేవాడని చెప్పారు. 34 హార్డ్ డిస్కుల్లో 21 వేల సినిమాలు స్టోర్ చేసుకున్నాడని, గాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాదర్ నుంచి ఓజీ వరకు సినిమాలు అందులో ఉన్నాయని వివరించారు. సుమారు నెలకు రూ. 10 లక్షల నుంచి -15 లక్షలు ఆదాయం సంపాదిస్తూ.. రూ.20 కోట్లు లాభాలు ఆర్జించాడని పేర్కొన్నారు. రవి నుంచి రూ.3 కోట్లు సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు.

ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా సీపీ సజ్జనార్ సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియా సమావేశం నిర్వహించారు.  సినీ ప్రముఖులు  చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేశ్​బాబు సమావేశంలో పాల్గొని పైరసీపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సినీ పరిశ్రమకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా పైరసీ తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.  సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. పైరసీ ప్రపంచవ్యాప్త సమస్య అని, తెలుగు సినీ పరిశ్రమతో కలిసి హైదరాబాద్ పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

బెట్టింగ్ యాప్స్కు జనం పర్సనల్ డేటా​
రవి ఉచిత సినిమాలు చూపించి యూజర్ల డేటాను సేకరించేవాడని సీపీ సజ్జనార్​ తెలిపారు. ‘‘రవి దగ్గర 50 లక్షల మంది యూజర్ల డేటా ఉంది.   ఇది డార్క్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టోర్ అయి ఉండొచ్చు. దీన్ని మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూజ్ చేసే అవకాశం ఉంది. వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లు, బెట్టింగ్ యాప్స్​ (వన్ విన్, వన్ ఎక్స్ బెట్)కు లింక్ చేసి ప్రమోట్ చేసేవాడు. ఫోన్లకు ఏపీకే ఫైల్స్​ను పంపి..  సైబర్​ నేరగాళ్లకు ఊతమిచ్చేవాడు. దీంతో చాలా కుటుంబాలు లక్షలు నష్టపోయాయి” అని ఆయన పేర్కొన్నారు.

రవి దగ్గర 35 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని.. అరెస్ట్ తర్వాత ఐబొమ్మ, బొప్పం వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లు డిలీట్ చేశారని తెలిపారు. ‘‘దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన రవిని పట్టుకున్నాం. ఇల్లీగల్ పనులు చేస్తూ తోపు మాపు అంటే చట్టం వదిలిపెట్టదు” అని సీపీ సజ్జనార్  హెచ్చరించారు. పైరసీ చూడటం నేరమని, అలా చేస్తే పర్సనల్ డేటా సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కుతుందని, ఇది మరింత ముంచుతుందని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎవరి దృష్టికైనా వస్తే 1930కు కాల్ చేయాలని సూచించారు. 

పైరసీని తరిమికొడదాం: సినీ ప్రముఖులు
కలిసి కట్టుగా పైరసీని తరిమికొడదామని సినీ ప్రముఖులు పిలుపునిచ్చారు. జనం కలిసి రావాలని వారు కోరారు. సీపీ సజ్జనార్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. చాలా కాలంగా సినిమాలు పైరసీ అవుతూ ఉంటే ఎంతో  బాధపడుతున్నామని,  సినిమా మీద ఎంతో మంది ఆధారపడ్డారని సినీ నటుడు చిరంజీవి అన్నారు. ‘‘ఎవరో ఒకరు వచ్చి ఆ సినిమాను ఒక్క రోజులో పబ్లిక్​ చేస్తే.. దాన్ని నమ్ముకున్న ఎంతో మంది నష్టపోతున్నారు. పోలీసులకే ఛాలెంజ్​విసిరిన వారిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు’’ అని ఆయన తెలిపారు. సినీ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఈ కేసు  సూపర్​హిట్​మూవీలా ఉంది. విలన్ మొదట్లో ఛాలెంజ్ చేస్తే .. చివరికి హీరోలు పట్టుకుంటారు. అచ్చం అలానే ఉంది. పైరసీ విషయానికి వస్తే.. జీవితంలో ఏదీ ఉచితంగా రాదు. పైరసీ సినిమాలు చూడడం వల్ల సినీ ఇండస్ట్రీ కంటే ప్రజలే ఎక్కువ నష్టపోతారు.

ఆ వెబ్​ సైట్ల ద్వారా డేటా డార్క్​ వెబ్​లోకి వెళ్తుంది. అప్పుడు అమాయకులు సైబర్​ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా వాటి జోలికి వెళ్లొద్దు. థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో సినిమాలు చూడండి” అని పేర్కొన్నారు. సినీ నటుడు నాగార్జున మాట్లాడుతూ.. ‘‘మా ఫ్యామిలీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా 2 రోజులు కొందరు డిజిటల్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. బ్యాంక్​ అకౌంట్స్​, ఏటీఎంలు లాక్​ చేశారు. తర్వాత మేం పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు ఇన్వాల్ అయ్యే సరికి నేరగాళ్లు కనబడకుండా పోయారు. మన డేటా ఇతరుల చేతిలో పడితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. ఇలా పైరసీ సినిమాలు ఉచితంగా చూపించడం వెనక ఉద్దేశం ఇలా డేటాను ఇతరులకు అప్పగించడమే’’  అని తెలిపారు.  

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్లో సిటిజన్‌ ‌‌షిప్ తీసుకొని..
ఇమ్మడి రవి విశాఖపట్నం వాసి అయినప్పటికీ కొంతకాలం కింద కరేబియన్​ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ లో సిటిజన్‌ షిప్ తీసుకున్నాడని సీపీ సజ్జనార్​ తెలిపారు. ‘‘ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటూ నెదర్లాండ్స్, దుబాయ్‌లో తిరుగుతూ సర్వర్లను మెయింటేన్ చేసేవాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో ఫిజికల్ సర్వర్లు ఏర్పాటు చేశాడు. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ రాకెట్ నడిపాడు” అని వివరించారు.