
- మూడు ప్రాంతాల్లో సిద్ధంగా 34 క్రేన్లు
- 3 లక్షలకు పైగా విగ్రహాలు వస్తాయని అంచనా
- స్థానిక ప్రాంతాల్లో 74 చోట్ల సదుపాయాలు
- బేబీ పాండ్స్‌తో పాటు చెరువుల వద్ద పనులు
హైదరాబాద్, వెలుగు : ఈ నెల28న జరిగే గణేశ్ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌పై 14, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌లో 10 క్రేన్లను సిద్ధం చేస్తున్నారు. పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్లని ఏర్పాటు చేయగా.. ఆయా ప్రాంతాల్లో విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతుంది. లైటింగ్, బారీకేడ్లను కూడా ఏర్పాటు చేశారు. సిటీలో శోభాయాత్ర కొనసాగే 18 కిలోమీటర్ల మేర రోడ్లపై చెట్ల కొమ్మలు తొలగించారు. స్థానికంగా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 33 చెరువులతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా 72 చోట్ల బేబి పాండ్స్‌ను ఏర్పాటు చేశారు.
ఇందులో 27 పర్మినెంట్ కాగా, 24 పోర్టబుల్ వాటర్ ట్యాంక్, 23 కృత్రిమ కొలనుల(ఎక్సావేషన్ వాటర్ ట్యాంక్ )ను సిద్ధం చేసింది. 5 ఫీట్ల కంటే తక్కువ ఎత్తు విగ్రహాల నిమజ్జనం సర్కిళ్ల వారీగా బేబి పాండ్స్‌లో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హుస్సేన్ సాగర్‌తో పాటు అన్నిచోట్ల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నిమజ్జనం కోసం రూ.25 కోట్లను బల్దియా ఖర్చు చేస్తుంది.
3 లక్షలకుపైగా విగ్రహాల నిమజ్జనం
గ్రేటర్లో 3 లక్షలకుపైగా వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఇందులో సగానికిపైగా హుస్సేన్‌సాగర్‌కు రానున్నాయి. ఇక్కడ ప్రతిఏటా 40కిపైగా క్రేన్లతో నిమజ్జనం నిర్వహించేవారు. ఇందుకు సుమారు 6 నుంచి10 గంటల సమయం పడుతుండడమే కాకుండా మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా నిమజ్జనం జరుగుతుంది.
ఈసారి అదనంగా క్రేన్లను ఏర్పాటు చేయాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవసమితి సభ్యులు కోరుతున్నారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటున్నారు.
సందడిగా ట్యాంక్‌బండ్ పరిసరాలు
ట్యాంక్‌బండ్, పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద గణేశ్ నిమజ్జనం పనులు ఇప్పటికే మొదలవగా.. పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. సాయంత్రం వచ్చే భక్తులతో రద్దీగా మారింది. చిన్న విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. ఇక ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4,5 వద్ద చేయనుండగా.. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 63 అడుగుల ఎత్తులో విగ్రహం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా భారీగా క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇబ్బందులు రాకుండా చూడాలి
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి. భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలి. అదనపు క్రేన్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలె.
– భగవంతరావు, భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్