Balakrishna: #NBK111 లొకేషన్ నుంచి ఫోటో లీక్.. షూటింగ్ మొదలుపెట్టిన 'కాంతార' కెమెరామెన్.!

Balakrishna: #NBK111 లొకేషన్ నుంచి ఫోటో లీక్.. షూటింగ్ మొదలుపెట్టిన 'కాంతార' కెమెరామెన్.!

నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #NBK111 .  ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో సినిమా కోసం నందమూరి అభిమానుల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.  ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడింది. ఈ క్రేజీ మూవీ షూటింగ్ లాంచనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి ( మార్చి 4, 2026 )  ముంబై సమీపంలోని ఒక భారీ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైనట్లు సమాచారం.

షూటింగ్ లొకేషన్ నుండి అప్‌డేట్!

ఈ సినిమా ప్రారంభం గురించి ‘కాంతార’ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన ఫోటోను పంచుకున్నారు. షూటింగ్ లొకేషన్‌లోని కెమెరా, లైటింగ్ సెటప్‌ను చూపిస్తూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే, మొదటి రోజే బాలయ్య సెట్స్‌లోకి అడుగుపెట్టారా లేదా అన్నది ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

‘మహారాజు’గా బాలయ్య!

ఈ సినిమా కేవలం మాస్ యాక్షన్ చిత్రం మాత్రమే కాదు, ఇదొక అత్యంత ప్రతిష్టాత్మకమైన పీరియాడిక్ డ్రామా. 19వ శతాబ్దపు నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో బాలకృష్ణ ఒక శక్తివంతమైన, గంభీరమైన మహారాజు పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బాలయ్యను గతంలో ఎన్నడూ చూడని రీతిలో, ఒక యోధుడిగా, పాలకుడిగా చూపించబోతున్నాను. ఇది కేవలం సినిమా కాదు.. చరిత్రలో నిలిచిపోయే ఒక దృశ్య కావ్యం అని దర్శకుడు గోపీచంద్ మలినేని ధీమా వ్యక్తం చేశారు.

►ALSO READ | Arjun Tendulkar: సచిన్ ఇంట పెళ్లి సందడి.. వైభవంగా అర్జున్ - సానియా కల్యాణం.. హాజరైన ప్రముఖులు!

స్టార్ కాస్టింగ్ ..

ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ వంటి చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, ఈ జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి.  మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ స్థాయిలో గర్జించిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ పీరియాడిక్ డ్రామా కోసం ఆయన మరిన్ని ప్రత్యేకమైన ట్యూన్స్‌ను సిద్ధం చేస్తున్నారట. సతీష్ కిలారు సారథ్యంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద గర్జన ఖాయమా?

గతంలో గోపీచంద్ మలినేని - బాలయ్య కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు #NBK111 సినిమాపై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. చారిత్రక అంశాలకు మాస్ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ మలినేని ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ , బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..