అన్ని పార్టీలు బీసీలకు10 సీట్లు ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య

అన్ని పార్టీలు బీసీలకు10 సీట్లు ఇవ్వాలి :  ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు పది సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్​చేశారు. గురువారం కాచిగూడలో జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ‘బీసీ న్యాయ యాత్ర’ చేపట్టాలని ఈ సందర్భంగా తీర్మానించారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 

పబ్లిక్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ కమిషన్లలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని బీసీలకు కేటాయించాలని డిమాండ్​చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నలుగురు బీసీలు మంత్రులుగా పనిచేయగా, సీఎం రేవంత్​రెడ్డి ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారన్నారు. కనీసం ఆరుగురిని కేబినెట్​లోకి తీసుకోవాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు నీల వెంకటేశ్, నాయకులు రాజేందర్, అంజి, సుధాకర్, వేముల రామకృష్ణ, అనంతయ్య, కోతులారం గుజ్జ కృష్ణ యాదవ్, వెంకటేశ్​గౌడ్ పాల్గొన్నారు.