ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి : అఖిల పక్ష నేతలు

ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి : అఖిల పక్ష నేతలు
  • లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తం: అఖిల పక్ష నేతలు

హైదరాబాద్ / పంజాగుట్ట, వెలుగు: రాష్ర్టంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. గత ఐదేండ్లుగా సుమారు రూ.7 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని..దీనివల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో “కాలేజీ విద్యార్థుల కన్నీటి చదువులు  ”అనే అంశంపై అఖిలపక్ష పార్టీలు ,విద్యార్ధి సంఘాలు, మేధావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల సమావేశం జరిగింది. 

ఈ మీటింగుకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రమణ, జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ విఠల్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు  తదితరులు హాజరయ్యారు.

నిర్లక్ష్య వైఖరి తగదు 

ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్యపై పెట్టిన పెట్టుబడిని మానవ వనరుల అభివృద్ధిగా చూడాలన్నారు. ముఖ్యంగా బడుగుల విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదని, పేద విద్యార్థులకు ఫీజుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యను ప్రైవేట్ కాలేజీల సమస్యగా చూస్తున్నదని చెప్పారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి  శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ.. విద్యార్థులంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క లేదని విమర్శించారు.

జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రీయింబర్స్ మెంట్ రాక పేద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..అయినా, ప్రభుత్వానికి కనికరం లేదని ఆరోపించారు. రెండ్రోజుల్లోనే  సీఎస్  ను, బీసీ మంత్రులను, డిప్యూటీ సీఎంలను కలుస్తామని వారి నుంచి సానుకూల స్పందన రాకుంటే వచ్చే నెల  16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని జాజుల హెచ్చరించారు .