V6 News

డీలిమిటేషన్ బిల్లు సమంజసం కాదు : ఆల్ పార్టీ నేతలు

డీలిమిటేషన్ బిల్లు సమంజసం కాదు : ఆల్ పార్టీ నేతలు
  • పబ్లిక్ డొమైన్​లో ఉంచి అభ్యంతరాలు స్వీకరించాలి: ఆల్ పార్టీ నేతలు
  • సీట్ల పునర్విభజనకు వ్యతిరేకంగా 18న ర్యాలీ: కోదండరాం
  • బేగంపేటలో తెలంగాణ సమాఖ్య ఆల్ పార్టీ మీటింగ్.. బీఆర్ఎస్, బీజేపీ దూరం 

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడం సమంజసం కాదని ఆల్ పార్టీ నేతలు అభ్యంతరం తెలిపారు. పబ్లిక్ డొమైన్‌‌‌‌లో ఉంచి అభ్యంతరాలు స్వీక రించాలని డిమాండ్ చేశారు. గురువారం బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో  “రాజ్యాంగానికి తూట్లు పొడిచే డీలిమిటేషన్” అనే అంశంపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడు తూ.. డీలిమిటేషన్ పై మీద రాహుల్ గాంధీ తన అభి ప్రాయాన్ని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.

డీలిమిటేషన్ అంశంలో బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, ఏకపక్షంగా బిల్లు పెట్టడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్'పై చర్చ జరగాలని, ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్  కోదండరాం మాట్లాడుతూ డీ లిమిటేషన్ జరుగుతున్న తీరుపై దేశ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తం వ్యక్తమవుతోందన్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన విభజన చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ తీరుపై ఈనెల 18న ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్ బాగ్ లోని బాబు జగ్జీవన్ విగ్రహం వరకు ర్యాలీ చేయాలని తీర్మానించినట్లు  ప్రకటించారు.  

ఏ సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్​చేస్తారో చెప్పడం లేదు..  సీఎం ప్రతిపాదన నచ్చకపోతే రాష్ట్రం గురించి అయినా బీజేపీ ఎంపిలు ఆలోచించాలి కదా.. అని ప్రశ్నించారు. 131వ సవరణ.. దేశానికి గొడ్డలిపెట్టు ” అని కోదండరాం వ్యాఖ్యానించారు. సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ  మాట్లాడుతూ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం శిక్ష వేయడమేనని మండిపడ్డారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌‌‌‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమేనని ధ్వజమెత్తారు. ఏ ఫార్ములా ప్రకారం సీట్లు పెంచుతున్నారో కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదన్నారు.  

రాష్ట్రాల ప్రత్యేకతలు, ఆకాంక్షలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పర్యావరణ వేత్త దొంతి నర్సింహరెడ్డి మాట్లాడుతూ ఎంపీల సంఖ్య పెంచడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదని  అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అన్నిపార్టీల లీడర్లు పాల్గొనగా,  బీజేపీ, బీఆర్ఎస్ నేతలు గైర్హాజరయ్యారు.