
ఆపరేషన్ సిందూర్ పై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశమైంది. పార్లమెంట్ లోని భవనంలో రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశనాకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా,జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ ,కిరణ్ రిజీజు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఓవైసీ సహా విపక్ష నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ పై రాజ్ నాథ్ సింగ్ విపక్ష నేతలకు వివరిస్తున్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ఎల్ వోసీ దగ్గర పరిస్థితులు,భద్రతపై సమాలోచనలు చేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని 9 ఉగ్రస్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆపరేషన్ సిందూర్ కు మద్దతు ప్రకటించాయి. భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనతో అన్ని రాష్ట్రాలను కేంద్రహోంమంత్రి ఇప్పటికే అలర్ట్ చేశారు. అటు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని పంజాబ్,రాజస్థాన్,గుజరాత్ లో పలు ఆంక్షలు విధించారు.
మరో వైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఎల్ వోసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మే 7న రాత్రి ప్రధానంగా పూంచ్ జిల్లాలోని బాలాకోట్, మెంధర్, మన్‌కోట్, కృష్ణ ఘాటి, గుల్పూర్, కెర్ని, పూంచ్ జిల్లా ప్రధాన కార్యాలయం వరకు దాడులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో, రాజౌరి జిల్లాలో, కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెక్టార్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ ఆర్మీ అటాక్ చేసింది. ఈ దాడుల్లో 13 మంది భారత పౌరులు చనిపోవడంతోపాటు డజన్ల కొద్దీ ఇండ్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.