V6 News

మహిళా రిజర్వేషన్ చట్టంపై రేపు ( ఏప్రిల్ 15 ) అఖిలపక్ష మీటింగ్..సమావేశం తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తం: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

మహిళా రిజర్వేషన్ చట్టంపై రేపు ( ఏప్రిల్ 15 ) అఖిలపక్ష మీటింగ్..సమావేశం తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తం: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి అన్ని పార్టీలతో సమగ్రమైన సంప్రదింపులు జరపడానికి కేంద్రం సిద్ధంగా లేదని ఖర్గే ఆరోపించారు. అందుకే తామే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ చట్టం) కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే, దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ఇలాంటి కీలక చట్టాల అమలుపై విస్తృత చర్చ జరగాలని అన్నారు. పంచాయతీలు, జిల్లా పరిషత్​లు, కార్పొరేషన్లలో మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ ఇప్పటికే అమలు చేసిందని, సోనియా గాంధీ చాలా కాలం క్రితమే ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు. రిజర్వేషన్ల గురించి మాకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరంలేదని ఖర్గే కౌంటర్​ ఇచ్చారు. 

ఈ చట్టం అమలులో కొన్ని సవరణలు తీసుకురావడానికి ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. తాము 15న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. అందులో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.