జనవరి 27న ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌..

జనవరి 27న ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌..
  • బడ్జెట్‌‌ సమావేశాల సందర్భంగా నిర్వహణకు కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌ బడ్జెట్‌‌ సమావేశాల సందర్భంగా ఈ నెల 27న ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మీటింగ్‌‌లో సభ వ్యవహారాలు, ఇతర అజెండాలను చర్చించనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో పార్లమెంట్‌‌ హౌస్‌‌లోని ప్రధాన కమిటీ రూమ్‌‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌‌ రిజుజు అధ్యక్షతన ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 28న రాజ్యసభ, లోక్‌‌సభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగంతో బడ్జెట్‌‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1 ఆదివారం రోజున పార్లమెంట్‌‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనుంది. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌‌ సమావేశాలు ఏప్రిల్2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటి విడత కింద ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత మార్చి 9న సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

 అయితే, యూపీఏ హయాంలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని.. వికసిత్‌‌ భారత్‌‌ గ్యారంటీ ఫర్‌‌‌‌ రోజ్‌‌గార్‌‌‌‌, అజీవిక మిషన్‌‌ (గ్రామీణ్‌‌) చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌‌ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న సమయంలో పార్లమెంట్‌‌ సమావేశాలు జరగనున్నాయి. కాగా, గత పార్లమెంట్‌‌ సమావేశాల్లో ఆమోదం పొందని 9 బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది.