
హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ఇచ్చిన హామీలన్నీ రాబోయే నాలుగు నెలల్లో నెరవేర్చాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో, జిల్లా పర్యటనల్లో, అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులపై అదనంగా వడ్డీ భారం పడిందని ఆయన తెలిపారు. ‘గిరిజనులకు పోడు పట్టాలు, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి. పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయాలి. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, దళితబంధు, బీసీలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలి. ఎన్ఆర్ఐలకు రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ధరణితో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలి’ అని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.