కుమ్రంభీం 82వ వర్ధంతి వేడుకలకు సర్వం సిద్ధం

కుమ్రంభీం 82వ వర్ధంతి వేడుకలకు సర్వం సిద్ధం

హాజరు కానున్న మంత్రి కేటీఆర్

ఆసిఫాబాద్, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీం 82వ వర్ధంతి వేడుకలను ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పోరుగడ్డ జోడేఘాట్ లో నిర్వహించేందుకు ఐటీడీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనేరావు, వారసులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమాధి వద్ద ఐదు గోత్రాల జెండాలను ఎగుర వేసి పూజలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ ​కోవ లక్ష్మి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. మంత్రుల కోసం ఇప్పటికే హెలి ప్యాడ్ సిద్ధం చేశారు. వర్ధంతి, అనంతరం గిరిజన దర్బార్ కు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు శనివారం పరిశీలించారు.

హట్టి నుంచి ఉచిత బస్సు సౌకర్యం

కుమ్రంభీం వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కెరమెరి మండలం హట్టి బేస్ క్యాంప్ నుంచి ఆసిఫాబాద్ డిపో ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ సుధా పరిమళ తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు హట్టి నుంచి జోడేఘాట్ బయలుదేరి వెళుతుందన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.