
హైదరాబాద్, వెలుగు:ఇటీవల వారం రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు గ్రేటర్‌లోని రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ గుంతలు పడి కంకర తేలింది. ఇసుక, మట్టి మేటలు వేసింది. ప్రస్తుతం అక్కడక్కడ కురుస్తున్న జల్లులకు గుంతల్లో నీళ్లు నిలుస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా, 90 శాతం రోడ్లపై గుంతలు కనిపిస్తున్నాయి. 709 కిలోమీటర్ల మేర ఉన్న సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా అన్ని రోడ్లు ఇలాగే ఉన్నాయి. దాదాపు 20 వేలకు పైగా పాట్ హోల్స్ ఉన్నాయి. వానలు తగ్గుముఖం పట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు జరగడం లేదు. మరో వైపు వానలు తగ్గాయి.. రోడ్లు వేయండని జనం నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు వినతులు ఇస్తున్నారు. దీంతో అధికారులు కొన్నిచోట్ల నామమాత్రంగా పాట్‌హోల్స్ పూడ్చి చేతులు దులుపుకుంటున్నారు. కంకర, డాంబార్ పోసి వదిలేస్తున్నారు. కొన్ని గంటల్లోనే మళ్లీ అక్కడ గుంతలు ఏర్పడుతున్నాయి.
వెహికల్స్ స్కిడ్ అవుతున్నయ్
ఇక్కడ.. అక్కడ అని ఏం లేదు. సిటీలోని రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. మెయిన్‌రోడ్లు, గల్లీలు ఇలా ఎక్కడ చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల అడుగుకో గుంత ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్నిలుస్తోంది. వానలు ఆగి మూడు రోజులు దాటినా బల్దియా అధికారుల్లో చలనం లేదు. గుంతలను పూడ్చేందుకు అత్యవసర బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా నామమాత్రంగా నియమించారు. ఫలితంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇటీవల లంగర్ హౌస్‌లోని టిప్పుకాన్ బ్రిడ్జిపై అడుగు మేర పడిన గుంతలు కనిపించక ఓ వ్యక్తి బైక్ పై నుంచి కిందపడిపోయాడు. వారాసీగూడలో రోడ్లు గుంతలు పడి కంకర తేలడంతో బైకులు స్కిడ్ అవుతున్నాయి. ఖైరతాబాద్, ఫలక్ నుమా, చందానగర్, మియాపూర్, కార్వాన్, జీయాగూడ, చార్మినార్, సికింద్రాబాద్, టోలిచౌకి, మల్కాజిగిరి ఇలా అనేక ప్రాంతాల్లో గుంతలు దర్శనమిస్తున్నాయి. రోడ్ల సమస్యలపై బల్దియాకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
సిటీ రోడ్లపై సోషల్ మీడియాలో వైరల్
ఎన్నికల టైంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీల ఆడియోలతో పాడైన రోడ్ల వీడియోలను మిక్స్‌చేసి జనం సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. డల్లాస్, ఇస్తాంబుల్ సిటీల తరహాలో రోడ్లు వేస్తామని చెప్పిన మాటలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. లీడర్లు మాటలు చెబుతున్నారే తప్ప ఆ తరహాలో పనులు చేయట్లేదని మండిపడుతున్నారు. హామీలు ఇచ్చే ముందు సాధ్యం అవుతుందా లేదా అన్నది ఆలోచించాలని సూచిస్తున్నారు. రోడ్ల నిర్వహణ, కొత్త రోడ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ఏటా బడ్జెట్లో రూ.900 కోట్లు కేటాయిస్తోంది. 2016 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.2,900 కోట్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ రోడ్లలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. వర్షాల టైంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంటుంది.
బల్దియా కమిషనర్ చర్యలేవి?
రోడ్లపై గుంతలు చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామని గత కమిషనర్లు ప్రకటిస్తే, ఇక ప్రైవేట్ఏజెన్సీలకు కేటాయించిన మెయిన్రోడ్లపై గుంతలు కనిపిస్తే అధికారుల జీతాల్లో కోత విధిస్తామని ప్రస్తుత కమిషనర్ లోకేశ్‌కుమార్ గతంలో హెచ్చరించారు. కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆదేశిస్తే హడావిడిగా చేస్తున్న అధికారులు తర్వాత పట్టించుకోవడంలేదు. కమిషనర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్విట్టర్లో సమాధానం ఇచ్చిన పనులు కూడా కావట్లేదని తెలుస్తోంది.
రోడ్ల నిర్వహణ మంచిగ లేదు
సిటీ రోడ్ల నిర్వహణ మంచిగ లేదు. ఎప్పుడో వేసిన రోడ్ల మీద పై పైన డాంబర్, కంకర వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ట్యాక్సులు వసూలు చేస్తున్నవారు రోడ్లను ఎందుకు బాగుచేయడంలేదు. అన్ని ప్రాంతాల్లోనూ గుంతలు కనిపిస్తున్నాయి. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేస్తున్న పనుల్లో క్వాలిటీ ఉంటే ఈ పరిస్థితి రాదు.
- శివచంద్రగిరి, బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్
అన్ని చోట్లా గుంతలే
నేను రోజూ క్యాబ్‌లో వంద కిలోమీటర్లు పైనే తిరుగుతాను. ఇటీవల కురిసిన వానలకు రోడ్లు ప్రమాదకరంగా మారాయి. ఎక్కడికక్కడ గుంతలు పడి కంకర తేలింది. దాదాపు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి త్వరగా రిపేర్లు చేస్తే బాగుంటుంది.
- సంతోష్ రెడ్డి, క్యాబ్ డ్రైవర్
ఇదేనా ఇస్తాంబుల్ అంటే?
డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలు ఏమైనయ్. సిటీ రోడ్ల మీద ప్రయాణించాలంటే భయంగా ఉంది. ఎక్కడ గుంత ఉంటుందో తెలియడం లేదు. ఇతర దేశాల్లోని సిటీలతో పోల్చకుండా హైదరాబాద్‌లో కనీస సదుపాయాలు కల్పిస్తే చాలు. ఇచ్చిన హామీలు కోటలు దాటడం లేదు.
- ప్రవీణ్సాగర్, ప్రైవేట్ ఎంప్లాయ్