సర్కార్​ దవాఖాన్లల్ల..  గర్భిణుల గోస

సర్కార్​ దవాఖాన్లల్ల..  గర్భిణుల గోస
  • గంటలకొద్దీ నిలబడే వెయిటింగ్​
  • ఎంతసేపు అని అడిగితే 
  • సిబ్బంది చీదరింపులు
  • డబ్బుల కోసం వేధింపులు
  • స్కానింగ్​ పరికరాలు లేక 
  • ప్రైవేట్​లోనే టెస్టులు
  • మందులూ బయటి షాపుల్లోనే


రాష్ట్రంలోని సర్కార్​ దవాఖాన్లల్ల సౌలతులు లేక గర్భిణులు గోస పడ్తున్నరు. కనీసం కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక గంటలకొద్దీ నిలబడే డాక్టర్​ కోసం ఎదురుచూస్తున్నరు. ఆస్పుత్రులల్ల స్కానింగ్​లు, టెస్టులు లేక బయట చేయించుకుంటున్నరు. మందులనూ బయట మందుల షాపుల్లోనే కొంటున్నరు. అత్యవసర మందులూ అందుబాటులో లేవు. రాష్ట్రంలోని అన్ని సర్కార్​ దవాఖాన్ల లోనూ ఇవే పరిస్థితులున్నాయి.

హైదరాబాద్​, వెలుగు: చెకప్​లు, కాన్పుల కోసం సర్కార్​ దవాఖాన్లకు పోతున్న గర్భిణులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. వారికి సిబ్బంది కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదు. కూర్చోవడానికి కనీసం కుర్చీలూ కరువే. టెస్టుల కోసం, డాక్టర్​ చెకప్​ కోసం నిండుచూలాలైనా గంటల తరబడి నిలబడి వేచి చూడాల్సిందే. యాష్టకొచ్చి ఇంకెంతసేపు అని అడిగితే.. వారి మీద నోరుపారేసుకుంటున్నారు సిబ్బంది. ఇదేం పద్ధతంటే గొడవలు పెట్టుకుంటున్నారు. తాగేందుకు మంచినీళ్లూ దొరకని దుస్థితి. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్​ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రమంతటా ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఉన్నా.. ఆరోగ్య శాఖ మాత్రం పట్టింపులేనట్టుగానే ఉంటోంది. 
స్కానింగ్ బయటే
కడుపులోని బిడ్డ ఎదుగదలను తెలుసుకునేందుకు స్కానింగ్​లే కీలకం. అలాంటి స్కానింగ్​ పరికరాలు చాలా ఆస్పత్రుల్లో లేనేలేవు. కమ్యునిటీ హెల్త్​ సెంటర్​‌‌‌‌ నుంచి టీచింగ్​ హాస్పిటళ్ల వరకూ స్కానింగ్​ యంత్రాలు అందుబాటులో లేవు. కొన్ని చోట్ల ఉన్న టెక్నీషియన్లు లేక మూలకుపడ్డాయి. స్కానింగ్​ కోసం గర్భిణులను ప్రైవేట్​కు పంపిస్తున్నారు. ప్రైవేటులో ఒక్కో స్కానింగ్​కు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాకా చార్జ్​ చేస్తున్నారు. థైరాయిడ్​, ఇతర రక్త పరీక్షలకూ బయటకే పంపిస్తున్నారు. అన్నింటికీ కలిపి రూ.పది వేల దాకా ఖర్చవుతోంది. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్​కు సోమవారం 73 మంది గర్భిణులు చెకప్​ కోసం వచ్చారు. స్కానింగ్​ సెంటర్​ లేకపోవడంతో 20 మందిని ప్రైవేట్​ దవాఖాన్లకు పంపించారు. అక్కడ కాల్షియం ట్యాబ్లెట్లు కూడా ఇవ్వట్లేదని గర్భిణులు ఆవేదన చెందుతున్నారు.  
డబ్బులిస్తెనే మర్యాద 
చెకప్​ల కోసం వస్తున్న గర్భిణులు, బాలింతలను దవాఖాన్ల సిబ్బంది డబ్బుల కోసం వేధింపులకు గుర్తిచేస్తున్నారు. అడిగినన్ని పైసలిచ్చినోళ్లకే మర్యాదనిస్తున్నారు. లేదంటే సూటిపోటి మాటలంటూ అవమానిస్తున్నారు. ఆ అవమానాలు భరించలేక అందరూ డబ్బులిచ్చేస్తున్నారు. కరీంనగర్​ సివిల్​ హాస్పిటల్​ ఎంసీహెచ్​లో ఒక్కో బాలింత వద్ద రూ.5 వేల దాకా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ డబ్బులు స్వీపర్లు, అటెండర్లు, పేషెంట్​కేర్​ వర్కర్లు వసూలు చేస్తున్నారు. శానిటేషన్​, సెక్యూరిటీ సూపర్​‌‌‌‌వైజర్లు, కాంట్రాక్టర్ల వరకూ వాటా అందుతున్నట్టు సిబ్బంది చెప్తున్నారు. తమకు టార్గెట్లు పెట్టి వసూలు చేయిస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే జీతంలో కట్​ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పేషెంట్ల నుంచి తామూ వసూలు చేస్తున్నామని చెప్తున్నారు.
డాక్టర్ల కొరత
గర్భిణుల సమస్యలకు డాక్టర్ల కొరత కూడా మరో కారణం. ఒక్కో డాక్టర్​ రోజూ కనీసం వంద  మంది గర్భిణులను చూడాల్సి వస్తోంది. ఆదిలాబాద్​ రిమ్స్​లో 30 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట, 11 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రోజూ వందల మంది గర్భిణులు చెకప్​ల కోసం వస్తుంటారు. ఒకటే స్కానింగ్​ సెంటర్​ ఉండడంతో స్కానింగ్​ కావాలంటే పొద్దంతా వెయిట్​ చెయ్యాల్సిన పరిస్థితి ఉంది. కాన్పు అయ్యాక బ్లీడింగ్​ను ఆపే ట్రామెక్సా ఇంజెక్షన్లు, ఇతర మందులు కూడా అందుబాటులో లేవని ఇక్కడి డాక్టర్లు చెప్తున్నారు. 
సీఎం ఇలాకాలోని ఆస్పత్రిలోనూ అంతే
కార్పొరేట్​ స్థాయి వైద్యం అందిస్తామని చెప్పే సీఎం కేసీఆర్​ నియోజకవర్గం గజ్వేల్​లోని దవాఖానలోనే కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కుర్చీలు కూడా లేక గర్భిణులు నేలపైనే కూర్చుంటున్నారు. స్కానింగ్​ సెంటర్​ ఉన్నా, సిబ్బంది కొరత పేరిట ప్రైవేటు డయాగ్నస్టిక్​ సెంటర్లకు పంపిస్తున్నారు. ఇక్కడి హాస్పిటల్​ సిబ్బంది తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని గర్భిణులు, వారి సహాయకులు చెప్తున్నారు. సిద్దిపేట జిల్లా హాస్పిటల్​లోనూ ఇదే దుస్థితి ఉంది. గర్భిణులను లోపలికి రానివ్వకుండా, గంటలకొద్దీ బయటే నిలబెడుతున్నారు. డెలివరీ చేయించుకుని దవాఖానలో బాలింతకు పెట్టే ఫుడ్​ దారుణంగా ఉంటోందని సిబ్బందే చెప్తున్నారు.
డెమో ఇవ్వలేదని మూలకేసిన్రు
భద్రాచలం ఏరియా హాస్పిటల్​లో స్కానింగ్​ మెషీన్​ పాడవడంతో, మూడు నెలల కిందట కొత్తది తెచ్చిపెట్టారు. దాన్ని ఎలా వాడాలో కంపెనీ వాళ్లు డెమో ఇవ్వలేదని మూలకుపడేశారు. ఈ ఏరియాలో ఉన్న ఏకైక దవాఖాన ఇదే కావడంతో తెలంగాణతో పాటు, ఏపీ, ఒడిశా, చత్తీస్​గఢ్​లోని సరిహద్దు గ్రామాల నుంచి వందలాది మంది గిరిజన మహిళలు ఇక్కడికి చెకప్​లు, కాన్పుల కోసం వస్తుంటారు. వీళ్లకి  స్కానింగ్​లు, టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబుల్లో రూ.800  వసూలు చేస్తున్నారు.  

ప్రాణాలు పోయినయి
ఈ నెల 8వ తేదీన కరీంనగర్​ సివిల్​ హాస్పిటల్​కు మానకొండూరు నుంచి నొప్పులతో ఓ గర్భిణి వచ్చింది. అక్కడి సిబ్బంది, డాక్టర్లు ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చాతిలో నొప్పి వస్తోందని ఆమె మొత్తుకున్నా స్పందించలేదు. కుటుంబ సభ్యులు కాళ్లావేళ్లా పడితే 4 గంటల తర్వాత లోపలికి తీసుకెళ్లారు. గంట తర్వాత ఆమె చనిపోయిందని మృతదేహాన్ని అప్పగించారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు దవాఖాన వద్ద ఆందోళనకు దిగారు. చనిపోయిన ఆ మహిళ మానకొండూరు పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేసేవారు.

నిలబడలేకపోతున్నాం
ప్రతి నెలా బోధన్​ హాస్పిటల్​కు చెకప్​ కోసం వస్తున్నాం. ఉదయం 9 గంటలకు వస్తే, మధ్యాహ్నం రెండింటి వరకూ నిలబడాల్సి వస్తోంది. ఇక్కడ కనీసం కుర్చీలు ఉండవు. మంచినీళ్లు ఉండవు. కింద కూర్చోవద్దు అని డాక్టర్ చెప్పినా, కాళ్ల నొప్పులు తట్టుకోలేక కింద కూసుంటున్నం. స్కానింగ్​ రాసినప్పుడల్లా, ఇక్కడ లేదు బయటనే చేయించుకోవాలె అని చెప్తున్నరు.                              ‌‌‌-‌‌‌‌‌‌‌‌కూనింటి లక్ష్మి, గర్భిణి, అమ్దాపూర్ 


మందులు కూడా లేవంట
ఆర్మూర్​ హాస్పిటల్​కు రాంగనే డాక్టర్​ స్కానింగ్​ చేయించుకుని రమ్మన్నారు. వెంటనే మా బిడ్డను తీసుకుని బయట ఏడు వందలు పెట్టి స్కానింగ్​ చేయించిన. స్కానింగ్ రిపోర్ట్​ చూసి ట్యాటెట్లు రాసిచ్చిన్లు. ఇక్కడ ట్యాబ్లెట్లు ఏం లేవంట. బయట పోయి మెడికల్ షాపులో మందులు తెస్తే రెండు వేల రూపాయలు అయినయ్.                                - కౌసల్య, భీమ్గల్​

డాక్టర్​ లేరని ప్రైవేటుకు పంపిర్రు
నారాయణ పేట జిల్లా ఆస్పత్రిలో డెలివరీ కోసం వెళితే 3 రోజులు ఆస్పత్రిలో పెట్టుకొని డాక్టర్​ లేరని కాన్పు చేయకుండా పంపించేశారు. ఆస్పత్రిలో ఒక్కరే గైనకాలజిస్ట్​ ఉన్నారని, రాత్రి డెలివరీ అయితే చేయలేమని సిబ్బంది చెప్పటంతో ప్రైవేటు ఆస్పత్రిలో డెలివరీ చేయించుకున్నం. రూ.30 వేలు ఖర్చు అయింది. జిల్లా ఆస్పత్రి పేరుకే ఉంది తప్ప సేవలు లేవు.               - అర్చన, బహర్పెట్, నారాయణపేట