
నిర్మల్ జిల్లాలో దారుణం.. పంట చేనులో పనిచేసుకుంటున్న మహిళపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు ఆమెకు విషం తాగించి చంపే ప్రయత్నం చేశారు. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన మహిళను స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
నిర్మల్ జిల్లా అల్లంపల్లి గ్రామంలో ఒక మహిళపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. శనివారం(సెప్టెంబర్13) ఈ ఘటన జరిగింది. పొలంలో పని చేసుకుంటున్న సమయంలో ముసుగు ధరించిన దుండగులు ఆమె దగ్గరకు వచ్చి బలవంతంగా విషం తాగించి పరారయ్యారు.
బాధితురాలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు ,కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దుండగులు మాస్కులు ధరించి వచ్చారని, అందుకే వారిని గుర్తించడం కష్టమైందని బాధితురాలు తెలిపినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.