హనుమకొండ సిటీ, వెలుగు: విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా గుత్తులుగా వేలాడే వైర్లను మార్చి 31 వరకు తొలగించాలని కేబుల్, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్ట విద్యుత్ భవన్ లో కేబుల్, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. విద్యుత్ స్తంభాలపై వైర్లను క్రమ పద్ధతిలో బంచ్ చేయాలన్నారు. కేబుల్ వైర్లన్నీ కనీసం 18 నుంచి 20 అడుగుల గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఏర్పాటు చేసుకోవాలన్నారు.
బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లకు సంబంధించిన జీపీఎస్ మ్యాపింగ్ వివరాలు ఎన్పీడీసీఎల్ కు అందజేయాలని సూచించారు. వివిధ ఏజెన్సీలు తమ పరిధిలోని పనులు కొంతమేర పూర్తయినట్లు చెప్పాయని, మిగిలిన పనులు పూర్తిచేయడానికి ఇంకా రెండు నెలల గడువు ఇవ్వాలని కోరారన్నారు. ఎయిర్ టెల్ సంస్థ ప్రతినిధులు ఉపయోగంలో లేని కేబుళ్ల తొలగింపు, కేబుళ్లను సక్రమంగా బంచ్ చేయడంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎండీకి వివరించారు. సమావేశంలో టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్, సీఈలు, ఎస్ఈలుపాల్గొన్నారు.
