వరంగల్, వెలుగు: మద్యం తాగి బండి నడుపుతూ ఏకంగా 11సార్లు పోలీసులకు చిక్కిన ఓ లిక్కర్ ప్రియుడు చివరకు జైలుపాలయ్యాడు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్ తెలిపిన ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన శివరాత్రి దేవయ్య గతంలో మద్యం తాగి పదిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు పట్టుపడ్డాడు. కౌన్సిలింగ్ ఇచ్చినా, చిన్నపాటి జరిమానా విధించినా మారలేదు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి పదకొండోసారి పూటుగా తాగి గ్రేటర్ వరంగల్లోని కాజీపేట ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కాడు. దీంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న అతడిపై కేసు నమోదు చేసి బుధవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాడు. అతడిపై గతంలో నమోదైన కేసులను చూసిన మేజిస్ట్రేట్ ఎస్.ఫాతిమా దేవయ్యకు 30 రోజుల జైలుశిక్ష విధించారు.
