
చెన్నై: కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీలపై టీవీకే చీఫ్, నటుడు విజయ్ ఫైర్ అయ్యారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ‘మీట్ ది పీపుల్స్’ పేరుతో విజయ్ ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళనాడు రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యమున్న తిరుచ్చి నుంచి శనివారం (సెప్టెంబర్ 13) ప్రచారాన్ని ప్రారంభించారు విజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే రెండూ ప్రభుత్వాలు ప్రజలను వివిధ మార్గాల్లో మోసం చేస్తున్నాయని విమర్శించారు.
ఈ రెండు పార్టీలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. యుద్ధానికి వెళ్లే ముందు రాజులు దేవాలయాలలో ప్రార్థనలు చేసినట్లుగానే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం మీ ముందుకొచ్చానని అన్నారు. టీవీకే పార్టీది కేవలం తన ఒక్క గొంతే కాదని.. యావత్ తమిళుల గొంతుక టీవీకే పార్టీ అని పేర్కొన్నారు. ప్రజలను హింసించే బీజేపీ, డీఎంకే పార్టీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని తీవ్రంగా ఖండించారు విజయ్. జమిలీ ఎన్నికల విధానం ఎలక్షన్ మ్యానిప్యులేషన్ అని ఆరోపించారు.
దక్షిణ భారతదేశ రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించే డీలిమిటేషన్‌ను బీజేపీ గొప్ప కుట్రగా అభివర్ణించారు. తమిళనాడు విద్యార్థులకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. తమిళ ద్విభాషా విధానానికి విరుద్ధంగా హిందీ, సంస్కృతాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తోందని మోడీ సర్కార్‌పై ధ్వజమెత్తారు.
►ALSO READ | ప్రధాని మోడీ తల్లి AI వీడియో ఎఫెక్ట్: కాంగ్రెస్ పార్టీపై ఢిల్లీలో కేసు నమోదు
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న తమిళనాడుకు విపత్తు సహాయ నిధులను అందించడంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతం చూపించిందని ఫైర్ అయ్యారు. శ్రీలంక నేవీ తమిళ మత్స్యకారులపై చేసిన దాడులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ద్రోహాలకు ఇవి కొన్ని ఉదహరణలు మాత్రమేనని ఎద్దేవా చేశారు.
బీజేపీ తమిళనాడుకు ద్రోహం చేస్తే.. డీఎంకె తన సొంత ప్రజలకు ద్రోహం చేసిందని నిప్పులు చెరిగారు. డీఎంకే ఎన్నికల్లో 505 హామీలు ఇచ్చి అందులో నాలుగో వంతు మాత్రమే నేరవేర్చారని ఆరోపించారు. రూ.100 ఎల్పీజీ సబ్సిడీ, నీట్ రద్దు, విద్యార్థి రుణాల మాఫీ, ఏటా 10 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడం, మహిళలకు 40% ఉద్యోగ కోటా, 3 లక్షల ఖాళీలను భర్తీ చేయడం, మత్స్యకారులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఉపాధ్యాయులకు ప్రయోజనాలు వంటి స్టాలిన్ ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రస్తావిస్తూ డీఎంకేపై విరుచుకుపడ్డారు విజయ్.