
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేసు నమోదు అయ్యింది. ప్రధాని మోడీ ఆయన తల్లి హీరాబెన్ మోడీపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల రూపొందించిన ఏఐ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ ఢిల్లీ ఎన్నికల సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోడీతో పాటు తల్లిని అవమానించే విధంగా ఏఐ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంకేత్ గుప్తా ఫిర్యాదు మేరకు ఢిల్లీ నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీపై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(2), 336(3)(4), 340(2), 352, 356(2), 61(2) కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో ఒక వీడియో క్రియేట్ చేసింది. ప్రధాని మోడీకి వాళ్ల అమ్మ కలలో వచ్చింది అనే క్యాప్షన్ ఇచ్చి ఈ వీడియోను బీహార్ కాంగ్రెస్ యూనిట్ సోషల్ మీడియా అఫిషియల్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రధాని మోడీ తీరును ఆయన తల్లి హీరాబెన్ తప్పుబడతారు.
‘‘ఓట్ల కోసం నా పేరును వాడుకుంటున్నావు.. అధికారం కోసం ఇంత దిగజారడానికి సిద్ధం అయ్యావా.. గతంలో నోట్ల రద్దు పేరుతో సామాన్య ప్రజలను రోడ్లపై నిలబెట్టావు’’ అంటూ వీడియోలో మోడీకి ఆయన తల్లి చురకలంటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ వీడియో బీహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియోపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని పరిధులు దాటింది.. మోడీ తల్లిని కించపరుస్తుంది.. చనిపోయిన వాళ్లను అవమానిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.