
- 22 నుంచి జీఎస్టీ స్లాబ్ ల మార్పు.. రేట్లు తగ్గే అవకాశం
- ఇప్పుడు బుక్ చేసుకుంటే.. అప్పుడు అదే రేటుకు డెలివరీ ఇస్తామంటూ ప్రకటనలు
కరీంనగర్, వెలుగు: కొత్త కార్లు, బైక్ లు కొనాలనుకునే కస్టమర్లు జీఎస్టీ తగ్గే వరకు ఆగాల్సిన అవసరం లేదని, తగ్గబోయే రేట్లకు ఇప్పుడే వెహికల్ బుక్ చేసుకోండంటూ షోరూమ్ ల యజమానులు ప్రీబుకింగ్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ‘మీకు నచ్చిన మోడల్ ఇప్పుడు బుక్ చేసుకోండి.. 22వ తేదీ తర్వాత వెహికల్ డెలీవరీ తీసుకోండి’ అంటూ కస్టమర్లను కన్విన్స్ చేస్తున్నారు. స్లాబుల సవరణ తర్వాత కొత్త జీఎస్టీ విధానం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుంది.
దీంతో కార్ల ధరలు మోడల్ ను బట్టి రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు, మోటార్ బైక్ ల రేట్లు రూ.7 వేల నుంచి రూ.20 వేల వరకు, మోడల్, ధరను బట్టి ఇతర వాహనాల ధరలు కూడా భారీగా తగ్గనుండడంతో వాటిని కొనుగోలు చేయాలనుకునేవారు.. ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 20 నుంచే చాలా వ్యాపారాలతోపాటు వెహికల్స్ బిజినెస్ అమాంతం పడిపోయింది. కొనుగోళ్లలో స్తబ్ధత నెలకొంది. దీంతో ఈ గ్యాప్ పీరియడ్ లోనూ కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు షోరూమ్ ల యజమానులు.. తగ్గబోయే రేట్లకే వెహికల్స్ ఇస్తామని చెప్తున్నారు.
షోరూమ్ లకు డబుల్ ధమాకా..
సాధారణంగా మిగతా రోజులతో పోలిస్తే ప్రతి సంవత్సరం దసరా(విజయ దశమి), దీపావళి పండుగల సమయంలో కొత్త వాహనాల కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. ప్రజల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు, షోరూమ్ ల యాజమాన్యాలు కూడా పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ ఈ సారి వారు ప్రకటించే రెగ్యులర్ ఆఫర్లకు తోడు.. జీఎస్టీ తగ్గడం కస్టమర్లకు కలిసొచ్చే విషయం. దీంతో కస్టమర్లకే గాక వెహికల్స్ కంపెనీలు, డీలర్లకు కూడా ఈ సారి దసరా, దీపావళి డబుల్ ధమాకా కానుంది.
అయితే 22వ తేదీ తర్వాత అంతా ఒకేసారి వచ్చి వెహికల్స్ బుక్ చేసుకుంటే కొన్ని మోడల్స్ అప్పటికప్పుడు దొరక్కపోవచ్చని, స్టాక్ దృష్ట్యా దసరా, దీపావళి వరకు డెలివరీ కాకపోవచ్చని చెప్తున్నారు. అందుకే ముందే నచ్చిన వెహికల్ బుక్ చేసుకుంటే.. 22 తర్వాత అప్పటి రేటుతోనే డెలీవరీ చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో కొందరు ప్రీబుకింగ్ చేసుకుంటుండగా.. మరికొందరు కస్టమర్లు మాత్రం ఇంకా వేచిచూసే ధోరణితోనే ఉన్నారని షోరూమ్ మేనేజర్లు చెప్తున్నారు. ప్రస్తుతం తాము జీఎస్టీ తగ్గించి అంచనాతో చెప్తున్న రేట్లు.. 22 తర్వాత అమల్లోకి వచ్చే రేట్ల పోలిస్తే రూ.5 వేల నుంచి10 వేల వరకు మాత్రమే తేడా ఉండొచ్చంటున్నారు.
టీవీ షోరూమ్ లు వెలవెల
టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్స్ లాంటి గృహోపకరణాలపైనా జీఎస్టీ తగ్గడంతో వీటిని కొనుగోలు చేయాలనుకునేవాళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ షాపులు వెలవెలబోతున్నాయి. ఒక్కో వస్తువుపై రూ.1000 నుంచి రూ.5 వేల వరకు తగ్గే అవకాశం ఉండడంతో కస్టమర్లు వేచిచూసే ధోరణితో ఉన్నారు. 22 తర్వాత విజయ దశమి, దీపావళి పండుగ సీజన్ లో గృహోపకరణాల కొనుగోళ్లు అమాంతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. షాపుల నిర్వాహకులు కూడా అందుకు తగ్గట్లుగా స్టాక్ తెప్పించుకుంటున్నారు.
ప్రీ బుకింగ్స్ పైనే ఫోకస్
కార్లు, బైక్ లు, త్రీవీలర్ల కొనుగోలుపై ఆసక్తి ఉన్న కస్టమర్లను ఆయా షోరూమ్ ల ఎగ్జిక్యూటివ్ లు ప్రీబుకింగ్ చేసుకునేలా కన్విన్స్ చేస్తున్నారు. పాత, కొత్త రేట్ కార్డులు, ధరల్లో తేడాలు చూపించి ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. అంతేగాక తమ వద్ద కొనుగోలు చేసే వారికి యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే బుక్ చేసుకోండి.. 22వ తేదీ తర్వాత ఎంత ధర ఉంటే అంతే చెల్లించండి అంటూ వీలైనంత ఎక్కువ మందితో బుకింగ్స్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, బుకింగ్స్ ఇలా ఉండగా, గత 10 రోజులుగా డెలీవరీలు మొత్తం బంద్ అయిపోయాయి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో షోరూమ్ ల నుంచి కొత్త వెహికల్ ఒక్కటి కూడా డెలీవరీ కావడం లేదు.