Asia Cup 2025: బ్యాటింగ్‎లో తడబడ్డ బంగ్లాదేశ్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

Asia Cup 2025: బ్యాటింగ్‎లో తడబడ్డ బంగ్లాదేశ్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా శ్రీలంతో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‎లో బంగ్లాదేశ్ తడబడింది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో బంగ్లా మోస్తారు స్కోర్‎కే పరిమితమైంది. ఆదిలోనే ఎదురుదెబ్బ తిన్న బంగ్లాను జాకీర్ అలీ (41), షామీమ్ హోస్సేన్ (42) ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది బంగ్లాదేశ్ జట్టు. శ్రీలంక బౌలర్లలో స్టార్ స్పిన్నర్ హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషారా, దుష్మంత్ చమీరా చెరో వికెట్ తీశారు. 

ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన బంగ్లాకు ఆదిలోనే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో కేవలం రెండు పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. తంజిద్ హసన్ తమీమ్‎ను శ్రీలంక స్టార్ బౌలర్ నువాన్ తుషారా క్లీన్ బౌల్డ్ చేయగా.. మరో ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్‎ను చమీరా బౌలింగ్‎లో పెవిలియన్ చేరాడు. 

దీంతో బంగ్లాదేశ్ రెండు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులో కుదురుకుంటున్న తోహిద్ హృదోయ్ (8) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత మెహదీ హసన్ (9) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో కెప్టెన్ లిటన్ దాస్ (28) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 

►ALSO READ | ఇండియానే కాదు.. ఏ జట్టునైనా ఓడించే దమ్ముంది: పాక్ కెప్టెన్ ఓవర్ కాన్ఫిడెన్స్

కానీ హసరంగా బౌలింగ్‎లో కీపర్‎కు దొరికిపోయాడు.  పీకల్లోతూ కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్‎ను జాకీర్ అలీ, షామీమ్ హోస్సేన్ ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. చివర్లో జాకీర్ అలీ (41), షామీమ్ హోస్సేన్ (42) ఆదుకోవడంతో బంగ్లా 139 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం శ్రీలంక 140 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‎కు దిగింది.