
హైదరాబాద్: కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలను సుల్తాన్ బజార్ పోలీసులు శనివారం( సెప్టెంబర్13) అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తమ విద్యార్థినిలను కొంతమంది పోకిరీలు వేధిస్తున్నారని యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోలీసులు ఫిర్యాదు చేయడం ముగ్గురు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు.
సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ కే నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా హాస్టల్ విద్యార్థినిల వాట్సాప్ నెంబర్ కు కాల్స్ చేస్తూ వారి వైవాహిక స్థితి, ఆరోగ్య సమస్యలు గైనకాలజీ సంబంధిత ప్రశ్నలు అడుగుతూ చెకప్ కోసం మియాపూర్ , దిల్ సుఖ్ నగర్ , కూకట్ పల్లి ప్రాంతాలకు రావాలని నిందితులు ఒత్తిడి చేశారు. వారికి కాల్స్ చేస్తూ, మభ్యపెట్టే మాటలు చెప్తూ వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీనుంచి 20 మంది విద్యార్థినీలు కనిపించడం లేదని, తప్పుడు వార్తలను ప్రచారం చేశారు.
►ALSO READ | నిర్మల్లో దారుణం..మహిళకు విషం తాగించి..హత్యాయత్నం,పరిస్థితి విషమం
ఈ ఘటనపై అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఫోన్ కాల్స్ వచ్చిన నెంబర్ల ఆధారంగా ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ లో ఉంటూ డ్రైవర్ పని చేసే కరీంనగర్ కు చెందిన పిళ్లి శ్రీనివాస్ (23) , కొంపల్లిలో ఉంటూ హౌస్ కీపింగ్ పని చేసే కరీంనగర్ కు చెందిన సురంపల్లి వెంకటేశ్వర్లు (19), బోరాబండలో ఉంటూ డెలివరీ బాయ్ గా పని చేసే వరంగల్ కు చెందిన సముద్రాల హరీష్ (25) లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి , రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ కే నరసింహ తెలిపారు.