భక్తులకు బిగ్ అలర్ట్: శ్రీమాత వైష్ణోదేవీ యాత్ర మరోసారి వాయిదా

భక్తులకు బిగ్ అలర్ట్: శ్రీమాత వైష్ణోదేవీ యాత్ర మరోసారి వాయిదా

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమాత వైష్ణోదేవీ తీర్ధయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు శనివారం (సెప్టెంబర్ 13) ప్రకటించింది. వైష్ణోదేవీ తీర్ధయాత్ర మార్గంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీర్థయాత్ర వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి.. 2025, సెప్టెంబర్ 14 నుంచి వైష్ణోదేవీ తీర్థయాత్ర తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం దృష్ట్యా యాత్ర వాయిదా వేసింది ఆలయ బోర్డు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. 

2025 ఆగస్టులో భారీ వర్షాలు, వరదలు జమ్మూ కాశ్మీర్‎ను అతలాకుతలం చేశాయి. క్లౌడ్ బరస్ట్ ధాటికి జమ్మూ కాశ్మీర్‎లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా రియాసి జిల్లాలో కుండపోత వాన బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న కురిసిన రికార్డ్ స్థాయి వర్షానికి రియాసి జిల్లాలో వైష్ణోదేవీ యాత్ర మార్గంలో ఉన్న త్రికూట కొండల పై నుంచి పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. 

►ALSO READ | యుద్ధానికి వెళ్లే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చా.. DMK, బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు: విజయ్

ఈ దుర్ఘటనలో 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది భక్తులు గాయపడ్డారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. శ్రీవైష్ణోదేవీ యాత్ర మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో 2025, సెప్టెంబర్ 14 నుంచి వైష్ణోదేవీ యాత్రను పున: ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ మరోసారి భారీ వర్షాలు కురవడంతో తీర్ధయాత్ర మళ్లీ వాయిదా పడింది.