48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం: కామారెడ్డిలో ఆల్‎టైమ్ రికార్డ్ వర్షపాతం నమోదు

48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం: కామారెడ్డిలో ఆల్‎టైమ్ రికార్డ్ వర్షపాతం నమోదు

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో గడిచిన 48 గంటల్లో 65 సెంటీమీటర్ల ఆల్‎టైమ్ రికార్డ్ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం (ఆగస్ట్ 28) ఉదయం నుంచి దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా.. ఓవరాల్‎గా దాదాపు 76 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. 

రెడ్ అలెర్ట్: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి. ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలర్ట్: ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఎల్లో అలర్ట్: భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. 

ALSO READ : కామారెడ్డిలో వరదలు తగ్గాయి..

బుధవారం (ఆగస్ట్ 27) నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలను వర్షం ముంచెత్తింది. ఈ రెండు జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. కుండపోత వానతో మెదక్, కామారెడ్డి జలమయమయ్యాయి. కొన్ని గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నీట మునిగాయి. కొన్ని గ్రామాలకు గ్రామాలే జల దిగ్భంధం కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 

వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఎడతెరిపిలేని వర్షం, ఉప్పొంగి ప్రవహిస్తోన్న వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్య్కూ టీములతో కలిసి పోలీసులు సహయక చర్యలు చేపట్టారు.