తెలంగాణ కబడ్డీ సంఘంలో కోటి రూపాయల పైనే నిధుల గోల్‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌!

తెలంగాణ కబడ్డీ సంఘంలో కోటి రూపాయల పైనే నిధుల గోల్‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌!
  • రూ. కోటిపైనే దుర్వినియోగం అయినట్టు ఫిర్యాదు
  • మాజీ సెక్రటరీ జగదీశ్‌‌‌‌‌‌‌‌, ట్రెజరర్ శ్రీరాములుపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌లో నిధులు దుర్వినియోగం అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు కోటిపైనే నిధులు పక్కదారి పట్టించినట్టు ఫిర్యాదు రావడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అబిడ్స్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఆ సంఘం మాజీ సెక్రటరీ  కె. జగదీశ్‌ యాదవ్, మాజీ ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.బి. శ్రీరాములుపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేశారు. గత 40 ఏండ్లుగా అసోసియేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఈ ఇద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ  సంఘం మాజీ జాయింట్ సెక్రటరీ  తోట సురేష్ ఫిర్యాదు చేశారు. ‘ఇంటర్ డిస్ట్రిక్ట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీల కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ  కేటాయించిన నిధులను జిల్లా కమిటీలకు చేరకుండా జగదీశ్‌‌‌‌‌‌‌‌, శ్రీరాములు దుర్వినియోగం చేశారు.  సంఘానికి అధికారికంగా ఒకే బ్యాంకు ఖాతా ఉండాలి. కానీ, మరో ఖాతా తెరిచి దాని ద్వారా సుమారు రూ. 60 లక్షలు విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేశారు.

2021లో సూర్యాపేటలో జరిగిన జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం కేటాయించిన రూ.1.20 కోట్లలో  రూ.50 లక్షలను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కోసం చింతల స్పోర్ట్స్ అనే సంస్థ ఇచ్చిన రూ. 20 లక్షల నిధులను కూడా దుర్వినియోగం చేశారు. ఏజీఎం, ఈసీ అనుమతి తీసుకోకుండా ఖర్చులు చేసి అవినీతికి పాల్పడ్డారు. దీన్ని ప్రశ్నించినందుకు నన్ను బెదిరించి మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుంచి అన్యాయంగా తొలగించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని క్రీడాకారులకు న్యాయం చేయాలి’ అని సురేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆరోపణలు అవాస్తవం: జగదీశ్‌
సురేష్‌ ఆరోపణల్లో వాస్తవం లేదని, తన హయాంలో సంఘం నిధులను వ్యక్తిగత అకౌంట్లకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదని జగదీశ్ వివరణ ఇచ్చారు. తెలంగాణ కబడ్డీ సంఘం పేరిటే రెండో బ్యాంక్ అకౌంట్ ఉందని, దాని ద్వారా వ్యక్తిగత ఖతాలకు లావాదేవీలు జరగలేదని సంఘం ప్రస్తుత సెక్రటరీ మహేందర్ రెడ్డి తెలిపారు.