ఈ నెల 31 నుంచి ఆలిండియా హార్టీకల్చర్ షో

ఈ నెల 31 నుంచి ఆలిండియా హార్టీకల్చర్ షో

హైదరాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ పచ్చదనం, పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆలిండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ఈ నెల 31 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. 6 రోజుల పాటు ఈ షో కొనసాగుతుందని వివరించారు. సోమవారం మంత్రి హరీశ్​రావు, హార్టీకల్చర్ షో ఇన్​చార్జ్ ఖాలీద్‌‌‌‌ అహ్మద్‌‌‌‌తో కలిసి 14వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్​ను ఆవిష్కరించి,  మాట్లాడారు. 

పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్​ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని తెలిపారు. హాట్‌‌‌‌ క్లైమెట్ యాపిల్‌‌‌‌, డ్రాగన్‌‌‌‌ ఫ్రూట్, న్యూ వెరైటీ ప్లాంట్స్‌‌‌‌, హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ వంటి కొత్త టెక్నాలజీ ఈ షోలో ప్రదర్శిస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా 150కు పైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 5 దాకా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా షో కొనసాగుతుందన్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన టిష్యూ కల్చర్‌‌‌‌ వెరైటీ డేట్ ఫామ్‌‌‌‌ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని వివరించారు.