భారత్‎కు బహిరంగ హెచ్చరికలు.. బంగ్లాదేశ్ హైకమిషనర్‎కు ఇండియా సమన్లు

భారత్‎కు బహిరంగ హెచ్చరికలు.. బంగ్లాదేశ్ హైకమిషనర్‎కు ఇండియా సమన్లు

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు హస్నాత్ అబ్దుల్లా ఇండియాపై విషం చిమ్మిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ను అస్థిరపరిస్తే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను (సెవెన్ సిస్టర్స్) ముక్కలు చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించాడు. హస్నాత్ అబ్దుల్లా రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ ముహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు ఇండియా సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల భారతదేశ వ్యతిరేక ప్రకటనలపై అధికారిక దౌత్య నిరసన తెలియజేయడంలో భాగంగా సమన్లు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

బంగ్లాదేశ్‌లో క్షీణిస్తున్న భద్రతా వాతావరణంపై ఇండియా తమ ఆందోళనలను హమీదుల్లాకు తెలియజేసినట్లు తెలిపింది. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలకు సంబంధించి ఇండియాపై తప్పుడు కథనాలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఈ ఘటనలకు సంబంధించి తాత్కాలిక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం లేదా సరైన ఆధారాలను ఇండియాతో పంచుకోకపోవడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది. 

ఇండియా బంగ్లాదేశ్‎తో సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉందని పునరుద్ఘాటించింది. బంగ్లాదేశ్‌లో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని.. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలని నిరంతరం పిలుపునిచ్చామని గుర్తు చేసింది. తాత్కాలిక ప్రభుత్వం తన దౌత్య బాధ్యతలకు అనుగుణంగా బంగ్లాదేశ్‌లోని భారత మిషన్లు, పోస్టుల భద్రతను నిర్ధారించాలని ఆశిస్తున్నామని ఇండియా స్పష్టం చేసింది. 

2024 జూలై, ఆగస్ట్‎లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‎లో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేశారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. 

ప్రాణ భయంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయింది. ఈ క్రమంలో షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. షేక్ హసీనా తర్వాత భారత వ్యతిరేకిగా పేరున్న మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‎లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. కొందరు బంగ్లా నేతలు బహిరంగంగానే ఇండియాపై విద్వేషం వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు హస్నాత్ అబ్దుల్లా ఇండియాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చేశారు.