ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. నేను ఏ తప్పు చెప్పలేదు, క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటూ వాదించారు. ఈ వారం పార్లమెంటులో చర్చలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కాంగ్రెస్ పై ఒత్తిడి చేయడంతో ఆయన వైఖరి మరింత రాజకీయ దుమారం రేపింది. నేను క్షమాపణ చెప్పను. నేను ఎలాంటి తప్పుడు మాటలు అనలేదు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని ఆయన తెగేసి చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ గురించి చవాన్ ఏమన్నారు అంటే ?
కొద్దిరోజుల క్రితం పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో చవాన్ మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం మొదటి రోజే పూర్తి ఓటమిని చూసిందని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించారు. భారత సైనిక విమానాలను పాకిస్తాన్ దళాలు కూల్చివేసాయని, ఆ తర్వాత భారత వైమానిక దళం (IAF) పూర్తిగా నేలమట్టం అయ్యిందని ఆయన ఆరోపించారు.
మొదటి రోజే మనం పూర్తిగా ఓడిపోయాం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా 7వ తేదీన అరగంట మాత్రమే జరిగిన వైమానిక యుద్ధంలో మనం మొత్తం ఓడిపోయాం అని చవాన్ అన్నారు. ఆ తర్వాత భయం వల్ల గ్వాలియర్, బటిండా లేదా సిర్సా నుండి మన విమానాలు కనీసం గాలిలోకి కూడా ఎగరలేదని ఆయన ఆరోపించారు.
పృథ్వీరాజ్ చవాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ సాయుధ దళాలను అణగదొక్కిందని, పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తుందని ఆరోపించారు. సైన్యంని కించపరిచే హక్కు ఎవరికీ లేదు.... రాహుల్ గాంధీ తన పార్టీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ప్రశ్నించింది.
ఈ వివాదం ముదురుతుండటంతో కాంగ్రెస్ పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలకి దూరంగా ఉండటానికి ప్రయత్నించింది. జార్ఖండ్ లోక్‌సభ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సాయుధ దళాలకు గట్టి అండగా నిలుస్తుందని, జాతీయ భద్రతా విషయాలలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని అన్నారు.
