ఏనాటికైనా అలా ఎగరాలని...

ఏనాటికైనా అలా ఎగరాలని...

చిన్నప్పుడు సూపర్‌‌‌‌ మ్యాన్‌‌ కార్టూన్‌‌ చూస్తూ.. ‘ఏనాటికైనా అలా ఎగరాల’ని కలలు కనేవాడు. కానీ, అతనికున్న లోపం ఆ కలల్ని చేరనీయలేదు. తోటి పిల్లల్ని చూస్తూ బాధ పడ్డ అతనికి, తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. తోడుగా నిలిచి, ఎగరటం నేర్పించారు. ఆ ధైర్యంతో ఇప్పుడు తన భార్యతో కలిసి బైక్‌‌ పైన లడఖ్‌‌ ట్రిప్‌‌ పూర్తి చేశాడు. మీకున్న లోపం మీ కలల్ని నెరవేర్చుకోలేకపోవడానికి కారణం కాకూడదంటున్న ఇరవై ఆరేండ్ల శివమ్‌‌ పోర్వాల్‌‌ గురించి..శివమ్‌‌ సొంతూరు అహ్మదాబాద్‌‌. ఐఐటి అహ్మదాబాద్‌‌లో గ్రాడ్యుయేషన్‌‌ పూర్తి చేసి బి. ఎస్‌‌. ఎన్‌‌. ఎల్‌‌.లో జాబ్‌‌ చేస్తున్నాడు. ఫోకోమెలియా సిండ్రోమ్‌‌ కారణంగా పుట్టుకతో కాళ్లు, చేతులు ఎదగలేదు. చిన్న చేతులు. ఆ చేతులు రెండింటికి నాలుగు చొప్పున వేళ్లు. వంకర తిరిగిన కాళ్లతో పుట్టిన శివమ్‌‌ను చూసి అందరూ జాలి పడేవాళ్లు. ఎలా బతకగలడని అనేవాళ్లు. అయినా జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తను అనుకున్నది, తనకు కావాల్సింది చేస్తూనే ఉన్నాడు ఇప్పటివరకు.  

అమ్మానాన్నల ప్రోత్సాహంతో...

ఆడుకోవటానికి వెళ్తే, తనకున్న డిసేబిలిటీని చూసి స్కూల్లో పిల్లలు ఏడిపించేవాళ్లు. వాళ్లతో కలవనిచ్చేవాళ్లు కాదు. ఇంటికొచ్చి ‘స్కూల్‌‌కి వెళ్లన’ని ఏడ్చేవాడు శివమ్‌‌. అతడిని బుజ్జగించి ‘నీకున్న లోపం వల్ల జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయకు. నువ్వేంటో అందరికి తెలిసేలా చేయాలి’ అనేవాళ్లు తల్లిదండ్రులు. అప్పటినుంచి అందరి పిల్లల్లానే పెంచుతూ, తన ప్రతీ అడుగులో వెన్నంటే ఉంటూ ముందుకు నడిపించారు. తనకు అందరిలా బైక్ రైడ్‌‌ చేయాలని, టూర్లు తిరగాలని ఉండేది. కానీ, ఆ కోరికని ఎప్పుడూ బయటపెట్టలేదు. కాలేజికి వెళ్లడంకోసం అప్పు చేసి స్కూటీ కొన్నాడు. దాన్ని మాడిఫై చేయించి సైడ్‌‌ వీల్స్ పెట్టించి శివమ్‌‌కు గిఫ్ట్‌‌ ఇచ్చాడు తండ్రి. 

నా స్వేచ్ఛ కోసం...

తల్లిదండ్రులు నేర్పిన జీవిత పాఠాలే మోటివేషనల్‌‌ స్పీకర్‌‌‌‌గా కూడా మార్చాయి శివమ్‌‌ను. జాబ్‌‌లో చేరకముందునుంచి స్కూల్స్‌‌, కాలేజీ, డిసేబిలిటీ కేర్‌‌‌‌ సెంటర్స్‌‌లో మోటివేషనల్‌‌ స్పీచ్‌‌లు ఇచ్చేవాడు. తనలాంటి వాళ్లను ఎప్పుడూ చులకనగా చూడొద్దని చెప్పేవాడు. వాళ్లకు సరైన గైడెన్స్‌‌ ఇస్తే వాళ్లూ గొప్పవాళ్లుగా మారతారని చెప్పేవాడు. మనసుకు బాధ అనిపించిన ప్రతీసారి అందరికీ దూరంగా బైక్‌‌ మీద ఎక్కడికో వెళ్లి తిరిగొస్తుంటాడు. ‘నీకున్న పరిస్థితి వేరు. ఇబ్బంది పడుతూ అంత దూరం ఎందుకువెళ్లడం’ అన్నా వినేవాడు కాదు. ‘ఇలా అయినా నాకు కొంత ఫ్రీడమ్ దొరుకుతుంది. నా ప్రపంచంలో నేను ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే అలా వెళ్తుంటా’ అంటాడు శివమ్‌‌.  ఇప్పుడు కూడా భార్యతో కలిసి లడఖ్‌‌ టూర్ చేశాడు. దానికోసం కొత్త రాయల్‌‌ ఎన్‌‌ ఫీల్డ్‌‌ బైక్‌‌ కొని తన అవసరానికి తగ్గట్టు మార్పులు చేయించాడు.  శివమ్‌‌కి కావాల్సిన కాన్ఫిడెన్స్‌‌ ఇస్తోంది భార్య ప్రీతి. అన్ని విషయాల్లో తోడుంటోంది. తనతో కలిసి ఇప్పటివరకు జోధ్‌‌పూర్‌‌‌‌, ఉదయ్‌‌పూర్‌‌‌‌, గోవా, లడఖ్‌‌ టూర్లు బైక్‌‌పైన పూర్తి చేశాడు శివమ్‌‌. 

‘ఇలా వెళ్లిన ప్రతీసారీ నాలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నాకు నేను కొత్తగా తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎవరూ కూడా లైఫ్‌‌లో ఏదో జరిగిందని వాటి దగ్గరే ఆగిపోకూడదు. అనుకున్నది చేయాలి. లక్ష్యాలను చేరుకోవాలి. అప్పుడే జీవితాన్ని తెలుసుకో గలుగుతాం’ అంటున్నాడు శివమ్‌‌.