హైదరాబాద్లో అమెజాన్ మెగా స్టేషన్

హైదరాబాద్లో అమెజాన్ మెగా స్టేషన్

అమెజాన్ కంపెనీ లాజిస్టిక్స్ రంగంలో తెలంగాణ, హైదరాబాద్‌‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. బుధవారం తెలంగాణలో అమెజాన్ ఏర్పాటు చేసిన అతిపెద్ద డెలివరీ స్టేషన్‌‌ను గచ్చిబౌలిలో జయేశ్ రంజన్ ప్రారంభించారు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ డెలివరీ స్టేషన్‌‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్ కూడా మన హైదరాబాద్‌‌లో ఉందన్నారు. ఇది ఎయిర్‌‌‌‌పోర్ట్ సమీపంలో ఉన్నట్టు చెప్పారు.

అత్యధిక ఆర్డర్లు చిన్న చిన్న పట్టణాల నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు. దీని కోసం అమెజాన్ సరికొత్తగా చిన్న కిరాణాషాపులతో భాగస్వామ్యమై ‘ఐ హ్యావ్ స్పేస్‌‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమం కిరాణా షాపుల వారికి ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించడానికి దోహదం చేస్తోంది. అంటే కిరాణా షాపుల్లో అమెజాన్ బాక్స్‌‌లను స్టోర్ చేసి, వాటిని వారికి సమీపంలోని ప్రజలకు డెలివరీ చేయొచ్చు. దీంతో రోజుకు రెండు మూడు గంటలు పని చేసి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం ఆర్జించేలా అమెజాన్ ఉపయోగపడుతోందని జయేశ్ రంజన్ చెప్పారు.

గత కొద్ది సంవత్సరాలుగా ఈకామర్స్ ప్రాధాన్యత పెరుగుతోందని, ఇండియాలో అమెజాన్ అత్యధిక మార్కెట్ షేరును పొందుతున్నట్టు తెలిపారు.ఎంత త్వరగా వస్తువులను డెలివరీ చేయగలిగితే ఈకామర్స్ కంపెనీలకు అంతి మంచి పేరు ఉంటుందని, ఫాస్ట్‌‌గా డెలివరీ చేయాలంటే వారి వద్ద లాజిస్టిక్స్‌‌ ఎక్కువగా ఉండాలన్నారు. టెక్నాలజీ పరంగా కూడా వారికి సపోర్ట్ చేస్తే, ఇవన్నీ మరింత సాధ్యమవుతాయని తెలిపారు.

గత రెండు లేదా మూడు నెలల నుంచి తెలంగాణలో తమ నెట్‌‌వర్క్‌‌ను విస్తరిస్తున్నామని,  ఇప్పటికే రాష్ట్రంలో అమెజాన్‌‌కు 90 సొంత డెలివరీ స్టేషన్లు, డెలివరీ సర్వీసు పార్టనర్లు ఉన్నట్టు అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ ట్రాన్స్‌‌పోర్టేషన్ డైరెక్టర్ ప్రకాశ్ రోచ్లాని చెప్పారు. వాటిలో 20 డెలివరీ స్టేషన్లు హైదరాబాద్‌‌లోనే ఉన్నాయన్నారు. 500కు పైగా పిన్‌‌ కోడ్స్‌‌లో డైరెక్ట్ డెలివరీ చేపట్టామని చెప్పారు. బుధవారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన అతిపెద్ద డెలివరీ సెంటర్ ద్వారా వందల మంది కస్టమర్లకు తమ సేవలందించనున్నామన్నారు.

2,500 కిరాణా షాపులు ‘ఐ హ్యావ్ స్పేస్’ స్టోర్లుగా ఉన్నట్టు కూడా పేర్కొన్నారు. మొత్తంగా హైదరాబాద్‌‌లో 3 ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లు ఉన్నాయని, వాటి స్టోరేజ్ కెపాసిటీ 3.2 మిలియన్ క్యూబిట్ ఫీట్‌‌ అని చెప్పారు. తెలంగాణలో మరింత విస్తరించడానికి పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌‌మెంట్, కస్టమర్ల సర్వీసులపై ఈ ఇన్వెస్ట్‌‌మెంట్లు పెడతామని వెల్లడించారు.

అమెజాన్ ప్లాట్‌‌ఫామ్‌‌పై తెలంగాణ నుంచి 17 వేల మంది సెల్లర్స్ ఉన్నట్టు తెలిపారు. అమెజాన్‌‌కు టాప్ 5 విభాగాలుగా స్మార్ట్‌‌ఫోన్లు, లార్జ్‌‌ అప్లియెన్స్, ఫ్యాషన్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమబుల్స్ ఉన్నాయి.